Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో ఐక్యత కనిపించిందన్న అభిప్రాయం వినిపించింది. కానీ అలాంటిదేమీ లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. రేవంత్ ను టార్గెట్ చేసుకునే అవకాశం వస్తే సీనియర్లు.. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తగ్గరని మరోసారి తేలిపోయిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి కారణం.. ఉచిత విద్యుత్ విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ ట్విస్ట్ చేసి ఆందోళనలు చేస్తే.. వాటిని గట్టిగా ఖండించకోవాల్సిన కాంగ్రెస్ రెండుగా విడిపోయింది. రేవంత్ ను ఇరికించేలా కొంతమంది మాట్లాడితే.. మరికొందరు.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. 


రేవంత్ అన్నది వేరు.. రాజకీయం అయింది వేరు   !


అమెరికాలోని తానా సభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి వారితో మట్లాడారు.  ఈ సందర్భంగా విద్యుత్ రంగంపై  చర్చ జరిగింది.  కేసీఆర్ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్న టాపిక్ పై రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్పారు. కేవలం కమిషన్ల కోసం ఇలా చేస్తున్నారని.. ఇరవై నాలుగు గంటలూ నీటి కోసం మోటార్లు ఆడించుకోరని..  మూడు ఎకరాలు ఉన్న  రైతు మూడు గంటల పాటు మోటర్ వేసుకుంటే.. పొలానికి నీళ్లు సరిపోతాయన్నారు. అయినా విద్యుత్ సంస్థల నుంచి వచ్చే కమిషన్ల కోసం కేసీఆర్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్నమాటలు తెలంగాణలో.. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలన్నట్లుగా ప్రచారం  జరిగిపోయింది. ఇలాంటి చాన్స్ వస్తే బీఆర్ఎస్ ఎందుకు ఊరుకుకంటుంది... ధర్నాలు చేసేసింది. 


బీఆర్ఎస్ వ్యూహంలో ఇరుక్కున్న కాంగ్రెస్


నిజానికి ఇలాంటి సందర్భం వస్తే.. ఏ రాజకీయ పార్టీ అయినా రేవంత్ తప్పుగా మాట్లాడారని అంగీకరించకూడదు. అలా జరిగితే పార్టీకే నష్టం జరుగుతుంది. వక్రీకరించారనో..మరొకటనో అధికార పార్టీపై ఎదురుదాడి చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ను ఇరికించే  చాన్స్ వచ్చిందన్నట్లుగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ వివరణ ఇవ్వాలని అన్నారు. అయితే రేవంత్ ఉద్దేశం ఉచిత విద్యుత్ ను తగ్గించడం కానీ.. మరొకటి కాదని ఆయన  బలంగా చెప్పలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలకు మరింత ఊపు తెచ్చినట్లయింది. భట్టి విక్రమార్క కూడా అలాగే స్పందించారు. దీంతో సీనియర్లు..ఈ వివాదంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందనే  అంశం కన్నా.. రేవంత్  ను కార్నర్ చేయడానికి వచ్చిన అవకాశంగా వినియోగించుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


బీఆర్ఎస్ కు పోటీగా ధర్నాలకు పిలుపునిచ్చిన ఇతర నేతలు


మరో వైపు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని.. పోటీ ధర్నాలకు కాంగ్రెస్ లోని ఇతర నేతలు పిలుపునిచ్చారు. పార్టీ అధికారిక స్పందనగా ఈ నేతలు.. గాంధీ భవన్ లో ఈ ప్రకటన చేశారు. మధుయాష్కీ ,  మల్లు రవి లాంటి సీనియర్ నేతలు ఈ పిలుపునచ్చారు. రేవంత్  రెడ్డి కూడా జరిగిన నష్టాన్ని  పూడ్చడానికి సబ్ స్టేషన్ల ముందు కరెంట్ ఇవ్వడం లేదని.. ఇరవై నాలుగు గంటల కరెంట్ పేరుతో మోసం చేస్తున్నారని నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది కాస్త డామేజ్ కంట్రోల్ కు పనికి వస్తున్నా..సీనియర్ల తీరు మాత్రం.. మరోసారి చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ కు కష్టం వస్తే ..దాన్ని ఎదుర్కోవడం కన్నా..రేవంత్ ను దెబ్బతీయడానికే సీనియర్లు ప్రాధాన్యం ఇస్తారన్న అంశం హైలెట్ కావడంతో.. కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు భగ్గుమనే  పరిస్థితి ఏర్పడింది.