Telangana Political News : పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. కానీ వారు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. బీజేపీ చేరికల కమిటీ ఇంచార్జ్ అయిన ఈటల రాజేందర్ వారితో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో బీజేపీతో ఒప్పందాల కోసం.. తమ డిమాండ్లకు ఒప్పుకునేలా చేయడం కోసమే కాంగ్రెస్ లో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకున్నారన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేసుకుంటున్నారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 


ఖమ్మం జిల్లా మొత్తం తన చేతుల్లో పెట్టాలంటున్న  పొంగులేటి  


పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి  ఒక్క సారి మాత్రమే ఎంపీగా వైఎస్ఆర్‌సీపీ తరపున  గెలిచారు.  బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ కేసీఆర్ ఆయనకు మరోసారి టిక్కెట్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇవ్వలేమని తేల్చేశారు. కానీ పొంగులేటి మాత్రం ప్రతి నియోజకవర్గంలోనూ తనదైన వర్గాన్ని పెంచి పోషించుకున్నారు. తనకు బలం ఉందని ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు నిరూపించే ప్రయత్నం చేశారు.  ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ మారిపోతానని హెచ్చరించారు. అలాగే చేశారు.  ఆయన ఏ పార్టీలో చేరలేదు కానీ..  అభ్యర్థుల్నిప్రకటిస్తూ పోతున్నారు. తాను ఏ పార్టీలో చేరినా వారందరికీ టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు.అందుకే ఏ పార్టీలో చేరాలనుకున్నా ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన చేతుల్లో పెట్టాలని ఆయన కోరుతున్నారు. 


కాంగ్రెస్‌తో చర్చలు - అంత సాహసం చేస్తారా ? 


పొంగులేటిని చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ   ప్రయత్నిస్తోంది.  రాహుల్ గాంధీ టీమ్ వచ్చి పొంగులేటితో చర్చలు జరిపింది. రెండు సీట్లు మినహా మొత్తం ఖమ్మం పొంగులేటి చేతుల్లో పెడతామని హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.  కానీ బడా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి చూసి చూసి కాంగ్రెస్ లో చేరగలరా అనేదే చాలా మందికి వస్తున్న సందేహం.    కాంగ్రెస్ లా బీజేపీ ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ... పొంగులేటికి ఆహ్వానం పలుకుతోంది.  గతంలోనే ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి పెట్టిన షరతులను బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని చెబుతున్నారు. తనతో పాటు ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలన్న షరతును పెట్టారు.  ఎంతో అత్యవసరం అయితే తప్ప చేరే నేతలు పెట్టే కండిషన్లకు బీజేపీ అంగీకరించదు. ఇక్కడా అదే జరిగిందని చెబుతున్నారు.  అందుకే బీజేపీపై ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ లో చేరుతున్నా అనే పుకార్లను ఆయన వర్గమే సృష్టించిందన్న అంచనాలు ఉన్నాయి. 


జగన్ అభిప్రాయం ప్రకారమే పొంగులేటి  రాజకీయం 


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పొంగులేటికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఏపీలో ఆయన సంస్థలకు  చాలా కాంట్రాక్టులు కూడా లభించాయి. అందుకే పొంగులేటి తరచూ జగన్ ను కలుస్తున్నారు. గత శుక్రవారం కూడా జగన్ ను కలిశారు. అయితే తెలంగాణలో వైసీపీ లేదు .. మళ్లీ ఆ పార్టీని యాక్టివ్ చేసే ఆలోచనల్లో లేరు కాబట్టి వైసీపీలో చేరే చాన్స్ లేదు. కానీ తెలంగాణలో ఏ పార్టీలో చేరాలో ఆయన సూచించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే జగన్ సూచించేది బీజేపీనేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  


జూపల్లి కూడా అదే తరహా డిమాండ్లు !
 
పొంగులేటి స్థాయిలో లేకపోయినా జూపల్లి కృష్ణారావు కూడా తనను సంప్రదిస్తున్నపార్టీల వద్ద పెద్ద చిట్టానే పెడుతున్నట్లుగా ఉన్నారు. గద్వాల జిల్లాపై తనకు పూర్తి ఆధిపత్యం ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ నేతల అవసరం ఉంది. అందుకే బీజేపీపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ వైపు వెళ్తున్నామన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారని భావిస్తున్నారు.