YS Sharmila Letter To CM Chandrababu: అదానీతో మాజీ సీఎం జగన్ (Jagan) చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) లేఖ రాశారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారమని.. ఈ అక్రమ ఒప్పందాలతో 25 ఏళ్ల పాటు పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని అన్నారు. 'విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయి. జగన్ ఏపీ పరువును తీశారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. అదానీ దగ్గర నుంచి గుజరాత్ యూనిట్ ధర రూ.1.99 పైసలకు కొంటుంటే, ఏపీ మాత్రం యూనిట్ ధర రూ.2.49 పైసలుగా అగ్రిమెంట్ చేసుకున్నారు.' అని షర్మిల మండిపడ్డారు. 


'అర్ధరాత్రి అనుమతులు'


అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు మొత్తం సీఎంవో నుంచే నడిచాయని.. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకొన్నట్లు షర్మిల చెప్పారు. 'ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఎలాంటి ప్రజాభిప్రాయం సేకరించకుండా, అదే కంపెనీ ఇతర రాష్ట్రాల్లో చేసుకున్న ఒప్పందాలను పరిశీలించకుండా వెంటనే ఆమోద ముద్ర వేశారు. అర్ధరాత్రి హడావుడిగా చేసిన అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి. అత్యవసరంగా సోలార్ పవర్‌ను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో, నిజానిజాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అదానీతో ఒప్పందాల రద్దుతో పాటు కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. అలాగే 2019 నుంచి 2024 మధ్య అదానీతో జరిగిన ఒప్పందాల మీద పూర్తిగా విచారణ జరగాలి.' అని లేఖలో ప్రస్తావించారు.


'చీమ కుట్టినట్లైనా లేదు'


'మన దేశం, రాష్ట్రం పరువు తీసేలా అంతర్జాతీయ మార్కెట్‌లో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. ముడుపుల అంశంలో కనీసం మీరు నోరు విప్పడం లేదు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ ప్రాజెక్టుతో పాటూ, రోప్‌వే నిర్మాణం, బీచ్ శాండ్ ఉత్పత్తుల ప్రాజెక్టులు, కొత్తగా సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు
చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. ముడుపుల వ్యవహారంలో అదానీ కంపెనీ చేసే కుట్ర ఏంటో తేటతెల్లం అయ్యింది. అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక మళ్లీ మీరు కూడా ఆ కంపెనీతోనే ముందుకు
వెళ్తారా లేక రాష్ట్రంలో అదానీ గ్రూప్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతారా తేల్చుకోవాలి. గంగవరం పోర్టు అదానీకి అమ్మడంపైనా విచారణ జరగాలి. గంగవరం పోర్టు తక్కువ ధరకు కట్టబెట్టడం వెనుక దాగి ఉన్న మర్మమేంటో కూటమి ప్రభుత్వం బయటపెట్టాలి. 2008న అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం గంగవరం పోర్ట్ తిరిగి ప్రభుత్వపరం అయ్యేలా చర్యలు చేపట్టాలి.' అని లేఖలో పేర్కొన్నారు.


Also Read: Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?