AP Politics : సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు విజన్‌ను పొగిడారు. 2024 సీఎం అయితే ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పారు. రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు రాలేదు. అధికార పార్టీ విధానాలపై కానీ .. ఏపీలో ఉన్న రాజకీయాలపై కానీ స్పందించారు. తన మిత్రుడ్ని పొగిడారు. దానికే వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ ఎందుకు రజనీకాంత్ విషయంలో దూకుడుగా ఉంది. తమను విమర్శించకపోయినా ప్రత్యర్థిని పొగడటాన్ని కూడా సహించలేకపోతున్నారా? రజనీ కాంత్‌నే వదల్లేదు.. ఇంకెవరు చంద్రబాబును టీడీపీని పొగిడినా అదే ఎదురుదాడి ఖాయమని సంకేతాలు పంపాలనుకున్నారా?
తమ జోలికి రాని వారి జోలికి వెళ్లవు రాజకీయ పార్టీలు !
సహజంగా రాజకీయాల్లో కనిపించని ఓ కట్టు బాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా తమను విమర్శిస్తేనే తిరిగి విమర్శించాలని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధంలేనివారు. సెలబ్రిటీలు అయినా మరొకరు అయినా తమకు ఉన్న వ్యక్తిగత అనుబంధాల రీత్యా.. ఏదైనా పార్టీని సపోర్ట్ చేస్తే.. ఇతర రాజకీయ పార్టీలు పట్టించుకోవు. కానీ వారు తమ మిత్రుల్ని పొగుడుకోకుండా. తమను విమర్శిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తాయి . తమ ప్రత్యర్థిని పొగిడేసి వెళ్లిపోతే పట్టించుకోవరు. కానీ రజనీకాంత్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ శతజయంతి కోసం వచ్చిన రజనీకాంత్.. ఏపీలో పరిస్థితులపై ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క విమర్శ కూడా చేయలేదు.
రజనీకాంత్ ఏమీ విమర్శించకపోయినా తీవ్రంగా విమర్శిస్తున్న వైఎస్ఆర్‌సీపీ!
రజనీకాంత్ వైఎస్ఆర్‌సీ పీసర్కార్ ను ఒక్క మాట అనలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం రజనీకాంత్‌ను అన్నీ మాటలన్నారు. చివరికి రజనీ ఆరోగ్యపరమైన అంశాలను కూడా ఎగతాళి చేశారు. వ్యక్తిగతంగా తిట్టి పోశారు. రజనీకాంత్ సూపర్ స్టార్. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యుడు. ఆయన చంద్రబాబును పొగడటమే తప్పన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడిన వైనం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తమిళనాడులోనూ ఈ అంశం వైరల్ అవుతోంది. అసలు రజనీ ఏమీ అనకుండా.. ఎందుకు ఆయనపై ఇంతలా వ్యక్తిగత దాడి చేస్తున్నారన్నది సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమయింది.
ప్రతిపక్షాన్ని పొగిడినా ఊరుకోబోమని గట్టి సందేశం పంపాలనుకున్నారా?
ఏపీలో విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. రజనీకాంత్ విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని..చంద్రబాబును రాజకీయాలకు సంబంధం లేని రజనీకాంత్ పొగిడితే.. వైసీపీ అంతటి సూపర్ స్టార్ ను సహించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక పక్కా వ్యూహం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేని.. చంద్రబాబును అభిమానించే అనేక మంది... ఆయనను పొగడటానికి .. ఆయన విజన్ ను అభినందించే అవకాశం ఉంది. సమాజంలో ఎంతో మంిది ప్రముఖులు చంద్రబాబును అభిమానిస్తారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి వారంతా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతారని.. అలా మాట్లాడితే సహించబోమని.. వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి చేస్తామన్న సంకేతాలను రజనీకాంత్ పై విరుచుకుపడటంమ ద్వారా పంపారని భావిస్తున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్.. అయినా ఆయనను వదల్లేదని ఇంకెవర్నయినా ఎందుకు వదులుతామన్నసంకేతాలు అందులో ఉన్నాయంటున్నారు.
వైఎస్ఆర్‌సీపీ తీరుపై విస్మయం - సైకో రాజకీయమని టీడీపీ నేతల విమర్శలు
రాజకీయంగా విమర్శిస్తే ఎదురుదాడి చేయడం సహజం కానీ... ప్రత్యర్థిని పొగిడినా సహించలేని అధికార పక్షం వ్యక్తిగత విమర్శలకు దిగడం.. వ్యక్తిత్వ హననం చేయడం ఖచ్చితంగా సైకో రాజకీయమని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఉనికినే సహించలేకపోతున్నారని.. వారని పొగిడినా భరించలేనంత మానసిక స్థితికి వెళ్లిపోయారని అంటున్నారు. ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరైనా ఏపీకి వచ్చి చంద్రబాబును పొగడాలంటే ఒకరిటికి రెండు సార్లు ఆలోచించుకవాల్సిందే. ఎందుకంటే... అలా పొగిడి వెళ్లిపోయిన తర్వాత వారిపై ఎలాంటి ఎదురుదాడి జరుగుతుందో రజనీకాంత్ విషయంలో స్పష్టమయిందన్న అభిప్రాయం రాజకీవర్గాల్లో వినిపిస్తోంది.