AP Minister Vasamshetty Subhash: కాకినాడ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదని ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.  కాకినాడ ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి మంత్రి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం తాగునీటి నిర్వహణ నిర్లక్ష్యం చేయడంతో, నీరు కలుషితమై ప్రస్తుతం ప్రజలు డయేరియా బారినపడుతున్నారని మంత్రి  సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో అవినీతి పరులు ప్రతిశాఖలో ఉన్నారని ఆరోపించారు.  


అందుబాటులో ఉండాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు 24 గంటలు పాటు వైద్యసేవలు అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఉపేక్షించ వద్దని మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసి, అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​కు మంత్రి సూచించారు.  


నవరత్నాల పైనే ఆశలు
వైసీపీ పాలనలో జగన్ కేవలం  నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడ్డారని ఆయన అన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలను  ఎత్తేశారని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో 11సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయేంటని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ పరిపాలన ఎలా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో  99శాతం హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి సుభాష్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


అందుకే తగిన బుద్ధి చెప్పారు
వైసీపీ విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  చంద్రన్న బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.  ఎమ్మెల్యేలందరితో కలసి పని చేస్తామన్నారు.  


జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే పరిశ్రమలు ఇతర రాష్ట్రలకు తరలి పోయాయన్నారు. రూ.3000 వేల కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు జగన్ పథకాలు కోసం మళ్లించినట్లు ఆరోపించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీలోకి రావడానికి ఛాన్స్ లేదు.. గేట్లు క్లోజ్ అయ్యాయన్నారు.  ప్రభుత్వ  స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా చాలా చోట్ల వైసీపీ పార్టీ కార్యాలయాలను నిర్మించారన్నారు.  లిక్కర్, ఇసుక దోపిడీ తో రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు.