Justice For  Agri Gold Victims: దశాబ్దకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న న్యాయం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు  ఆరు నెలల గడువులోకా  నగదు చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన  అగ్రిగోల్డ్  ఉదంతం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. దాదాపు 19 లక్షల మంది బాధితులు ఏపీలోనే 11.5 లక్షల మంది  ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలకు తెరదించేలా చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల గడువును నిర్దేశించింది. ఈ సమస్య పరిష్కారానికి ఒక  త్రిసభ్య ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధితులకు కేవలం అసలు మొత్తమే కాకుండా, వీలైతే వడ్డీతో సహా చెల్లించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Continues below advertisement

 అసలు అగ్రిగోల్డ్ బాధితులు ఎవరు? 

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని,  భవిష్యత్తులో స్థలాలు ఇస్తామని నమ్మబలికిన అగ్రిగోల్డ్ సంస్థ ప్రకటనలను నమ్మి మధ్యతరగతి, సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేశారు. ఇందులో కూలీలు, చిరు వ్యాపారులు, గృహిణులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో కలిపి ఈ సంస్థ సుమారు  రూ. 7,386 కోట్లను వసూలు చేసింది. ఏపీలో న్యాయం జరగక ఇప్పటికే సుమారు 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడటం ఈ విషాద తీవ్రతను తెలియజేస్తోంది.

Continues below advertisement

భారీగా నిధుల మళ్లింపు

ఈ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రంగంలోకి దిగి ప్రధాన నిందితులైన అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషు నారాయణరావు, ప్రసాద్ వంటి వారిని అరెస్ట్ చేసింది. సుమారు 130 షెల్ కంపెనీలను సృష్టించి ప్రజల సొమ్మును డైరీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఆయుర్వేద రంగాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిపై పీఎంఎల్ఏ  చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి.

 ఆస్తుల వేలం - నిధుల సమీకరణ 

బాధితులకు సొమ్ము చెల్లించడానికి ఉన్న ప్రధాన మార్గం అటాచ్ చేసిన ఆస్తుల వేలం. ఇప్పటికే ఈడీ సుమారు రూ. 4,141 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో సుమారు రూ. 3,950 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు పంచడానికి కోర్టు అనుమతించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వివాదాల్లో లేని ఆస్తులను గుర్తించి, కోర్టు అనుమతితో పారదర్శకంగా వేలం వేయాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్తుల వేలం ఆలస్యమైతే, ప్రభుత్వ ఖజానా నుంచి అడ్వాన్స్ నిధులను ఇచ్చి అయినా బాధితులను ఆదుకోవాలని సీఎం యోచిస్తున్నారు.

 ప్రభుత్వ బాధ్యత - రాజకీయ సవాల్ 

గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు కొందరు నిందితులతో కుమ్మక్కై ఆస్తులను తక్కువ ధరకు కాజేయాలని చూశారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, అత్యంత పారదర్శకమైన  డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మధ్యవర్తులు లేకుండా బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్ద కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న లక్షలాది కుటుంబాలకు ఈ ఆరు నెలల గడువు పెద్ద ఊరటనిస్తోంది.  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే. ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయితే, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అతిపెద్ద పాలనాపరమైన విజయంగా నిలుస్తుంది.