AP Congress Sharmila struggle : ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా వెలిగిన కాంగ్రెస్ పార్టీ, విభజన పరిణామాల తర్వాత ఉనికి కోల్పోయింది. అయితే, వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపించింది.  తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, ఆయన సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ షర్మిల సాగిస్తున్న పర్యటనలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా తన అన్న, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే పార్టీ బలపడిందన్న అభిప్రాయం మాత్రం ఎవరికీ కలగడం లేదు. 

Continues below advertisement

అన్నపై పోరు – వైఎస్ఆర్ అభిమానుల డైలమా 

వైఎస్ఆర్ అభిమానులు ,  ఓటు బ్యాంకు పదేళ్ల పాటు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ వెంటే నడిచారు. అయితే, షర్మిల ఎంట్రీతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశాలు  ఉన్నాయనుకున్నారు.  వారిని ఆకర్షించాలనే షర్మిల రాజకీయాలు చేస్తున్నారు. జగన్ తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగించారని, ఆస్తుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఆమె చేస్తున్న ఆరోపణలు సామాన్య వైఎస్ఆర్ అభిమానులను ఆలోచనలో పడేస్తున్నాయి.  రాజన్న అసలు వారసురాలు షర్మిలే  అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె కొంతవరకు విజయవంతమయ్యారు. కానీ, అట్టడుగు స్థాయిలో ఈ సానుభూతి ఓట్లుగా మారుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Continues below advertisement

ప్రభుత్వంపై   పోరాటం 

ఒకవైపు తన అన్నపై వ్యక్తిగత ,  రాజకీయ విమర్శలు చేస్తూనే, మరోవైపు అధికార కూటమి   వైఫల్యాలను ఎండగట్టడంలో షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, నిరుద్యోగం వంటి అంశాలపై ఆమె గళమెత్తుతున్నారు. కేవలం జగన్ వ్యతిరేక ఓట్లే కాకుండా, ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తిని కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ఆమె తన వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరనే పోటీ నెలకొన్న తరుణంలో, షర్మిల తన చురుకైన ప్రసంగాలతో కాంగ్రెస్‌ను వార్తల్లో నిలుపుతున్నారు.

హైకమాండ్ నుంచి సపోర్ట్ ఏది?  గడచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి కాంగ్రెస్ చీల్చిన ఓట్లు కూడా ఒక కారణం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటు శాతాన్ని 5 నుండి 10 శాతానికి పెంచుకోగలిగితే, అది వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అదే సమయంలో, కూటమి ఓట్లను కూడా కాంగ్రెస్ ప్రభావితం చేయగలిగితే, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతాయి. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు , రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారా అనేదే ఇక్కడ కీలకం. వైఎస్ఆర్ పేరును బలంగా వాడుకోవడంలో ఆమె సక్సెస్ అవుతున్నారు. అయితే, పార్టీకి గ్రామ స్థాయి నుంచి బలమైన కేడర్ లేకపోవడం, ఆర్థిక వనరుల కొరత పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. పార్టీ హైకమాండ్ నుంచి అనుకున్నంత  సపోర్టు లేదు. రాహుల్ గాంధీ కూడా తరచూ పర్యటనలకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.