BRS Leaders IN Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ఓ వెలుగు వెలిగింది. తెలంగాణ (Telangana)తో పాటు పక్క రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని వ్యూహాలు రచించింది. అనుకున్నదే తడవుగా కార్యాచరణ రూపొందించి...అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త...జాతీయ పార్టీగా మార్చేశారు. భారత రాష్ట్ర సమితి (BRS)గా కేసీఆర్ (KCR )నామకరణం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉప్పునిప్పుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ బిఆర్ఎస్ తన కార్యాలయాన్ని ప్రారంభించింది. గుంటూరులో కార్యాలయం పెట్టారు.


ఇప్పుడు అదే బిఆర్ఎస్ ను సెంటిమెంట్‌గా టిఆర్ఎస్ గా మార్చాలని...సొంత రాష్ట్రంలో  డిమాండ్లు వస్తున్నాయి. టిఆర్ఎస్‌గా మారిస్తే ఏపీలో రాజకీయాలు చేయడం కష్టమేనని స్థానిక రాజకీయ నేతలు చెబుతున్నారు. ఏపీ బీఆర్ఎస్‌ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఏపీలో కొన్నాళ్లు బాగానే నడిచింది. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో... అది పాల పొంగేనని తెలిసిపోయింది. కార్యాలయం నిర్వహణ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 


మొదట్లో హంగామా...తర్వాత సైలెంట్


బిఆర్ఎస్ కార్యాలయం ఓపెనింగ్ సమయంలో హంగామా చేసిన నేతలు...మూడు రోజులకే చప్పబడిపోయారు. మొదట్లో కొన్ని రోజులు సందడిగా ఉన్న కార్యాలయం...కొద్ది రోజులకే స్తబ్దుగా మారిపోయింది. దీంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బలాన్ని రుచి చూపించింది. పార్టీ కార్యాలయం నడుపుతున్నందున అడపాదడపా రాష్ట్ర అధ్యక్షులు వచ్చినప్పుడు,  కార్యాలయం వద్ద  సందడి కనిపిస్తోంది. అంతే తప్పా ఆ పార్టీ  కార్యాలయంలో మిగతా ఏ కార్యక్రమాలు జరడం లేదు. మొదట్లో బిఆర్ఎస్ కార్యాలయం ఏపీలో  పెట్టడానికి అనేక తర్జనభర్జనలు పడ్డారు. మంగళగిరిలో అని, విజయవాడలో అని, చివరికి గుంటూరులో తీసుకొచ్చి పెట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ గుంటూరు వాసి కావడంతో అక్కడ కార్యాలయాన్ని ఇక్కడ పెట్టారు. ఆ తర్వాత కూడా రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్  వస్తే తప్ప కార్యాలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. కార్యకర్తలు కూడా రావడం లేదు.


తలో దారి చూసుకుంటున్న ఆ ఇద్దరు నేతలు


ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా తలో దారి చూసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు బిఆర్ఎస్ ఏపీలో బతికిబట్ట కడుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్ పక్క పార్టీలకు వెళ్లిపోతారని, ఆయన కుటుంబం గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి రావెల  కిషోర్ బాబు రేపో  మాపో వైసిపి కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ఏపీలో ఉన్నదే ఇద్దరు కీలక నాయకులైతే... ఆ ఇద్దరు తమ దారి తాము చూసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఏపీలో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనని తెలుస్తోంది. అయినా సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఉన్న భారత రాష్ట్ర సమితికి,  పక్క రాష్ట్రంలో అధికారం సాధించడం, అధికారంలో కీలక పాత్ర పోషించడం సాధ్యమయ్యే పనేనా అంటున్నారు.