ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ( AP BJP ) భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును త్వరలో తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీలో సోము వీర్రాజు ( Somu Veerraju ) అంటే సరిపడని వర్గం ఈ సారి తమకే అధ్యక్ష పీఠం దక్కేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని ( Vijayawada ) ఓ హోటల్‌లో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీనికి సోము వీర్రాజుకు కానీ ఆయన వర్గంగా పేరు పడ్డ ఇతర నేతలకు కానీ సమచారం ఇవ్వలేదు. 


యూపీ ఎన్నికల్లో ( UP Elections ) బీజేపీ తరపున ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సత్యకుమార్‌కు ( Satya Kumar ) అభినందన సభ పేరుతో సమావేశమయ్యారు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో జరిగిన ఈ సభకు  కన్నా లక్ష్మి నారాయణ , లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ , పాతూరి నాగభూషణం , మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు , ఎస్కే బాజీ , శ్రీనివాస రాజు వంటి ముఖ్యనేతలు హాజరయ్యారు. వీరందరూ సత్యకుమార్ ను ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరారు. 


ఈ సమావేశంలో   అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్న నేతలు సత్యకుమార్ ను పోగడ్తలతో ముంచెత్తారు. సోము వీర్రాజుకు కనీస సమాచారం లేకపోవడం.. ఆయన అనుకూలమైన నేతలెవరికీ పిలుపులేకపోడంతో... ఇది సోము వీర్రాజు వ్యతిరేక వర్గీయుల సమావేశంగా చెప్పుకుంటున్నారు. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో పొత్తులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ( YSRCP ) సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు ప్రస్తుత నాయకత్వంపై ఎక్కువగా ఉన్నాయి.ఈ కారణంగా మిత్రపక్షం జనసేన కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపించడం లేదు. 


సోము వీర్రాజు కూడా పొత్తుల విషయంలో ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని కేంద్ర హైకమాండ్ చూసుకుంటుందని చెప్పినా సోము వీర్రాజు... పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అంటూ రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. వీటన్నింటి కారణంగా వచ్చే ఎన్నికలకు వ్యూహం మార్చుకునే దిశగా ఉన్న బీజేపీ.,..  ఏపీలో నాయకత్వాన్ని మారుస్తారని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతల్లో ఈ నమ్మకం ఎక్కువగా ఉండటంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రేసు ప్రారంభమయింది.