Ramulu Nail Will Join BRS : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫ్యాక్స్ చేశారు. అలాగే జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు కూడా రాజీనామా లేఖను పంపించారు. రాములు నాయక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అయిన రాములు నాయక్‌కు కాకుండా మదన్ లాల్‌కు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. టిక్కెట్ రాకపోయినప్పటికీ బుజ్జగింపుల కారణంగా బీఆర్ఎస్‌లో ఉండిపోయారు.
తాజాగా పార్టీలో తనకు ఇప్పటికీ ప్రాధాన్యత లేదని చెబుతూ ఆయన రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. రాములు నాయక్ పార్టీని వీడుతున్న విషయం తెలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌లు రెండు రోజుల క్రితం ఖమ్మంలోని రాములు నాయక్ నివాసంలో ఆయనను కలిశారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు.
2018 సంవత్సరం ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్‌పై విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాములు నాయక్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైరా టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు కేటాయించారు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ రాములు నాయక్‌కు టికెట్ రాకుండా కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో విధేయుడుగా పనిచేసినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జి వ్యవహారంలో ప్రాధాన్యత కల్పించలేదని ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న తనను కాదని ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన మదన్ లాల్ ను ఎలా ఇన్చార్జ్‌గా నియమించారని ఎంపీలను ప్రశ్నించారు. వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మదన్ లాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన అప్పులను ప్రస్తుత ఎంపీ ఎన్నికల సమయంలో వచ్చే నిధులతో తీర్చేందుకు మదన్ లాల్ ప్రయత్నిస్తున్నారని కూడా రాములనాయక్ ఆరోపించారు. అనంతరం ఎంపీలు బుజ్జగించిన రాముల నాయక్ తన నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టం చేసినట్లు సమాచారం . మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గతంలో తనకు ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీలో రాములు నాయక్ చేరతారని ప్రచారం జరుగుతుంది.