YSRCP vs TDP Confrontation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఘర్షణ వాతావరణం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా సరే శాంతిభద్రతల సమస్యను సృష్టించి, తద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాలనే ఒక పెద్ద  పొలిటికల్ అలజడి  ప్లాన్ నడుస్తోందని తెలుగుదేశం పార్టీ  అగ్రనాయకత్వం ముందే పసిగట్టింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అత్యంత కీలకమైన అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు చేసే వ్యక్తిగత దూషణలకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఎవరూ తొందరపడి ప్రతి సవాళ్లు చేయవద్దని, వారి వ్యూహాత్మక  ట్రాప్ లో పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కఠినమైన లైన్ విధించారు.

Continues below advertisement

 ఎదురుదాడి చేయకపోతే  చేతకానితనం అనుకోరా? 

అయితే, ఇక్కడే క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి మరియు రాజకీయ విశ్లేషకుల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు వైసీపీ నేతలు మైకుల ముందుకు వచ్చి తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు, కొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నప్పుడు.. అధికార పార్టీగా ఉండి కూడా టీడీపీ నేతలు మౌనంగా ఉండటం సాధ్యమేనా? అలా ఉంటే దాన్ని ప్రజలు  చేతకానితనం గా భావించే ప్రమాదం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో దాడులను, కేసులను భరించి అధికారంలోకి వచ్చిన తమ్ముళ్లు.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా సవాళ్లకు ప్రతి సవాళ్లు చేయవద్దని అధిష్ఠానం చెప్పడాన్ని జీర్ణించుకోవడం క్షేత్రస్థాయిలో కొంత కష్టంగానే మారింది.

Continues below advertisement

 ఇది చేతకానితనం కాదు.. ముందస్తు మాస్టర్ వ్యూహం ! 

 ది చేతకానితనం కాదు, చంద్రబాబు మార్క్ అత్యంత లోతైన రాజకీయ వ్యూహం అని పార్టీ సీనియర్లు సర్ది చెబుతున్నారు. . ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు, ఏపీకి పెట్టుబడుల సాధన, అమరావతి-పోలవరం నిర్మాణాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎక్కడైనా చిన్న ఘర్షణ లేదా గొడవ జరిగినా, దాన్ని పెద్దది చేసి చూపడం ద్వారా  ఏపీలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాతావరణం బాగోలేదు  అని జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనేది విపక్షం వ్యూహంగా ఉంది. ఆ ట్రాప్‌లో పడితే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టే, చంద్రబాబు నాయకత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

 వైసీపీ విసిరే  ట్రాప్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా తప్పించుకోవాలి? 

ఈ పొలిటికల్ ట్రాప్ నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు అధిష్ఠానం ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చింది. వైసీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా రోడ్లపైకి వచ్చి గొడవలు చేయడం, శపథాలు చేయడం వంటివి పూర్తిగా మానేయాలి. ప్రత్యర్థులు చట్టాన్ని ఉల్లంఘిస్తే లేదా దాడులకు దిగితే.. వ్యక్తిగతంగా రియాక్ట్ అవ్వకుండా, ఆ విషయాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో  సహా పోలీసు వ్యవస్థకు అప్పగించాలి. తాము బాధితుల స్థానంలో ఉంటూ, చట్టం ద్వారానే విపక్ష నేతలకు బేడీలు పడేలా చేయడం ద్వారా.. అటు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినట్లు ఉంటుంది, ఇటు ప్రత్యర్థులను కోర్టుల చుట్టూ తిప్పినట్లు అవుతుందని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రతిపక్ష నేత విమర్శలు చేస్తే.. దానికి వీధుల్లో కొట్లాటలతో కాకుండా, కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి గణాంకాలతో తిప్పికొట్టాలని హైకమాండ్ సూచించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడం ద్వారా.. ప్రజల్లోనే విపక్షంపై ఉన్న వ్యతిరేకతను సజీవంగా ఉంచవచ్చని భావిస్తున్నారు. దూషణలకు దిగే నేతలపై ఉన్న పాత క్రిమినల్ కేసులు, విచారణలను చట్టపరంగా వేగవంతం చేయడం ద్వారా వారి నోళ్లకు తాళం వేయవచ్చని, అంతేకానీ అధికారంలో ఉండి తామే స్వయంగా గొడవలకు కారణం కాకూడదని భావిస్తున్నారు.

 అభివృద్ధి అజెండాతోనే విపక్షానికి అసలైన చెక్! 

 చంద్రబాబు చెప్తున్న ఈ సైలెంట్ వ్యూహం కిందిస్థాయి క్యాడర్‌కు కొంత నిరుత్సాహం కలిగించినా, దీర్ఘకాలికంగా కూటమి ప్రభుత్వానికి ఇది ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వస్తాయి. విపక్షం ఆశించేదేమో రచ్చ.. ప్రభుత్వం కోరుకునేదేమో అభివృద్ధి. అందుకే, ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా, చట్టాన్ని తన పని తాను చేసుకోనిస్తూ, కేవలం  అభివృద్ధి-సంక్షేమం అనే అజెండాతోనే వైసీపీని పూర్తిగా రాజకీయంగా నిర్వీర్యం చేయవచ్చనేదే టీడీపీ అగ్రనాయకత్వం నమ్ముతున్న అసలైన సిద్ధాంతమని చెబుతున్నారు.