టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. ముఖ్యంగా బాలకృష్ణ ప్రవర్తన అభ్యంతరంగా ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఆయన మీసాలు మెలేయడంతోపాటు తొడలు కొట్టారని అన్నారు. అయితే ఇవన్నీ ఆయన మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 


వాయిదా తర్వాత శాసనస సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ రూలింగ్  ఇచ్చారు. 
సభ ప్రారంభమైన టైంలో టీడీపీ ఎమ్మెల్యేబాలకృష్ణ చేసిన చర్యలు అభ్యంతరకంగా ఉన్నాయని అన్నారు స్పీకర్. ఆయన మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం మంచి సంప్రదాయం కాదని అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన చర్యలు తప్పే అయినా మొదటి తప్పుగా భావించి క్షమించి వదిలేస్తున్నట్టు తెలిపారు. 


అదే టైంలో ఆందోళన సమయంలో అసెంబ్లీ సొత్తును ధ్వంసం చేసిన సభ్యులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను సమావేశాలు పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ధ్వంసమైన వస్తువుల డబ్బులను వారి నుంచే రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. 


ఇద్దరిపై చర్యలు తీసుకోవడంపై టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి లేచి... టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. మిగతా వారి ప్రవర్తన సరిగా లేదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించారు. 


వెంటనే స్పీకర్‌ కలుగుజేసుకొని పయ్యావుల కేశవ్‌ను కూడా సమావేశాలు పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనుమతి లేకుండా సభా వ్యవరాహాలను సెల్‌ఫోన్‌లో షూట్ చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు అరవడంతో స్పీకర్ చర్యలు తీసుకున్నారు. సభను ఆర్డర్‌లోకి తీసుకునేందుకు మిగతా 15 మంది సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. 


సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. ప్రభుత్వానికి, స్పీకర్‌కు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబుపై పెట్టిన కేసులు విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా గందరగోళం నడుస్తున్న టైంలో స్పీకర్‌ సభను టీ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.