janasena Joinings : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Assembly Elections 2024)సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే... ఈసారి వైసీపీని కొట్టి తీరాలన్న ధ్యేయంతో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena)అడుగులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో మళ్లీ పొత్తుపెట్టుకున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.


ఎన్నికల టైంలో వలసల బెడద 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. అధికార పార్టీలో నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీల్లోకి....తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థులు ఎంపికలో నిమగ్నమయ్యారు. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు...భారీ ఎత్తున నేతలను పార్టీలోకి చేర్చుకొని కండువాలు కప్పుతున్నాయి. 


వారం వ్యవధిలో నేతల చేరిక 


త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, ఓ సిట్టింగ్ ఎంపీ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ (Pavan Kalyan ) తో అనేక సార్లు మంతనాలు జరిపిన తర్వాత...క్లారిటీకి వచ్చారు. ఆ పార్టీలో సీటు కన్ఫాం కావడంతో...పార్టీ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. మరో వారం రోజుల్లోనే చేరికలు ఉండనున్నాయి. ఈనెల 27న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ (Konathala Ramakrishna ), 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham), వచ్చే నెల 2న వల్లభనేని బాలశౌరి (Balashowry)జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలకు పార్టీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి విందుకు...అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల్లాగే...మచిలీపట్నం ఎంపీ బాలశౌరి  హాజరయ్యారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో బాలశౌరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ వ్యాఖ్యలతో మనసు నొచ్చుకున్న బాలశౌరి..వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ మారిన రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని, మంత్రి జోగి రమేష్ తో విభేదాల కారణంగా రాజీనామా చేసినట్లు బాలశౌరి తెలిపారు. రాజీనామా ప్రకటించిన రోజే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఒకసారి గుంటూరు...మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. 


త్వరలోనే ముద్రగడతో పవన్ భేటీ


ముద్రగడ పద్మనాభంతో కొన్ని రోజులు జనసేన నేతలు సంప్రదింపులు జరిపారు. అవి సక్సెస్ కావడంతో జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే పవన్ కల్యాణ్ తోనూ సమావేశం కానున్నారు ముద్రగడ. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985 ఎన్నికల్లో...తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై...మంత్రిగా కూడా పని చేశారు. 1999లో కాకినాడ నుంచి లోక్‌సభకు తెలుగుదేశం తరపున పోటీ చేసి విజయం సాధించారు. 


మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగానూ పని చేశారు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన...టీడీపీ అభ్యర్థిపై గెలుపొంది పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. 1991లో రెండోసారి కూడా అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావుపై గెలుపొందారు. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశారు.