Amaravati Legalization Bill YSRCP Will oppose in Parliament : అమరావతి రాజధాని అంశం మరోసారి పార్లమెంటు వేదికగా చర్చకు వస్తోంది. రాజధాని నగరానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే అమరావతి రైతులకు న్యాయం జరగాలన్నదే తమ విధానమని ఆయన పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అస్పష్టంగానే న్యాయం నిర్వచనం
వైసీపీ చెబుతున్న రైతులకు న్యాయం అనే మాటలో స్పష్టత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని అనిశ్చితిలోకి నెట్టడం వల్ల రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు కూడా న్యాయం అని మాట్లాడుతున్నారే తప్ప, ఆ న్యాయం ఏ రూపంలో ఉండాలి.. తంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలునా లేక మరేదైనా కొత్త ప్రతిపాదననా అన్నది ఆ పార్టీ నేతలు వివరించలేకపోతున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ అస్పష్ట వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన బలపడుతోంది.
వివాదమా? చట్టబద్ధతా?
రాజధానిపై పదేపదే వివాదాలు సృష్టించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని అందరి అభిప్రాయం. గత కొన్నేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటాలు, రాజకీయ ప్రకటనల వల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, భూములు ఇచ్చిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాజధానిపై ఇంకా వివాదాలు సృష్టించడం వల్ల పెట్టుబడులు వెనక్కి పోవడమే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి భిన్నంగా, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ద్వారానే రైతులకు అసలైన భరోసా లభిస్తుంది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడమే రైతులకు జరిగే అతిపెద్ద న్యాయం. చట్టబద్ధత ఉంటే ప్రభుత్వాలు మారినా రాజధాని మారదనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ భరోసా వల్ల అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి, భూముల ధరలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు దక్కాల్సిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన వాటాలు అప్పుడే విలువను సంతరించుకుంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యం
రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని వివాదాల్లో ఉంచడం కంటే, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే అది వివాదాల ద్వారా సాధ్యం కాదు, కేవలం రాజ్యాంగబద్ధమైన రక్షణ ,వేగవంతమైన అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. పార్లమెంటులో రాబోయే బిల్లు ఈ దిశగా ఒక కీలక మలుపు అవుతుందని ఆశించవచ్చు. కానీ అది వైసీపీ విధానం మీదనే ఆధారపడి ఉంటుంది.
