YSRCP, BJP And TDP :  ఆంధ్రప్రదేశ్‌లో అధికార , ప్రతిపక్ష పార్టీలు ఒకే మాట ఉన్న సందర్భాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి సందర్భం మంగళవారం చోటు చేసుకుంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ద్రౌపతి ముర్మును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేరుగా మద్దతు  ప్రకటించింది. ఆ పార్టీ నేతలు ఆమె నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోలేదు. సోమవారం మాత్రమే చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమీక్షించి సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.


చివరి నిమిషంలో ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటన ! 


రాష్ట్రపతి అభ్యర్థులు రాష్ట్రాలకు వచ్చి తమకు మద్దతు ప్రకటించిన వారితో మర్యాపూర్వకంగా సమావేశం కావడం మద్దతు ఇవ్వాలని కోరడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఖరారైన తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినతిధులతో సమావేశం ఉంటుందని అనుకున్నారు. అయితే ఆమె విజయవాడకు వచ్చే ఒక్క రోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో  వారు ఏర్పాటు చేసిన సమావేనికి కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము అమరావతి వచ్చారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన  సమావేశంలో పాల్గొన్నారు. తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.  


వైఎస్ఆర్‌సీపీతో పాటు టీడీపీ సమావేశానికీ బీజేపీ నేతల ప్రాధాన్యత 


వైఎస్ఆర్‌సీపీ ఏర్పాటు చేసిన సమావేశానికి  బీజేపీ రాష్ట్ర నేతలు కూడా హాజరయ్యారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ రాష్ట్ర నేతలుహాజరయ్యారు.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వేదిక మీద కూర్చున్నారు. కిషన్ రెడ్డి చంద్రబాబు ముర్ము అందరూ మాట్లాడారు. గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. గతంలో ఎన్జీఏలో ఉన్న సమయంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చాలా స్వల్ప సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అవేమీ నిర్ణయాత్మకం కాదు. అయినప్పటికీ టీడీపీ ఆత్మీయ సమావేశానికి బీజేపీ నేతలు కూడా అందరూ హాజరయ్యారు. 


ఈ  ఏకాభిప్రాయం ఏపీ పార్టీల్లో మళ్లీ రావడం కష్టమే !


బీజేపీని వ్యతిరేకించడానికి ఏపీలో  రాజకీయ పార్టీలు సిద్దంగా లేవన్న విమర్శలు ఉన్నాయి. అయితే గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవుతూండటం...  ప్రతిపక్ష పార్టీల తరపున నిలబడిన యశ్వంత్ సిన్హాకు పెద్దగా మద్దతు లభించకపోతూండటంతో ద్రౌపది ముర్ముకే- మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలు నిర్ణయించుకున్నారు. జనసేన తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు ఓటు హ క్కు ఉంటుంది. అయితే ఆయన వైఎస్ఆర్‌సీపీలో అనధికారికంగా చేరిపోయారు. ఈ కారణంగా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జనసేన ఎలాంటి ప్రకటన చేయలేదు.