AP Roads Nadu - Nedu :  ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై ఒక్క ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఓ సారి ఏపీ రోడ్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. విపక్ష నేతలు పోరాటాలు చేశారు. జనసేన పార్టీ ఓ సారి డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. పవన్ కల్యాణ్ స్వయంగా శ్రమదానం కూడా చేశారు. ఈ క్రమంలో గత నెలలో సమీక్ష చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూలై పదిహేనో తేదీ కల్లా మున్సిపాలిటీల్లో రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఖచ్చితంగా చేసి చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలా చేయడమే కాదు.. నాడు - నేడు పేరుతో ఆ రోడ్ల ఫోటోలను ప్రదర్శనకు పెట్టాలని కూడా జగన్ ఆదేశించారు. ఇప్పుడు  జాలై 15వ తేదీ ముంచుకొచ్చేసింది.  మరి ఏపీ రోడ్లు బాగుపడ్డాయా ? కనీసం పనులైనా ప్రారంభించారా  ?


ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో  ఏపీలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. గంతలు లేని రోడ్డే లేకుండా పోయింది. దీంతోప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల గుంతలు తప్ప రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి రోడ్ల దుస్థితిని చాలా మంది సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన జూలై 15 దగ్గరకు వచ్చినా ఇదా పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. 


గత  నెలలో ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు రోడ్ల మరమ్మతుల పనులు చాలా చోట్ల ప్రారంభించలేదు. వర్షాకాలం అని తెలిసినప్పటికీ అధికారులు జాగ్రత్త పడలేదు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.  గుంతల వల్ల అసలే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన చెందుతూంటే.. ఇప్పుడు నీళ్లు నిలబడటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


గత మూడేళ్లుగా రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతీ వర్షాకాలం ముందు వర్షాల్లో పనులెలా చేస్తారని మంత్రులు వాదించేవారు. వర్షాకాలం ముగియగానే అద్దల్లాంటి రోడ్లను సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్కరోడ్ బాగుపడలేదు.  ఇప్పుడు సీఎం పెట్టిన జూలై 15 డెడ్ లైన్‌ ప్రకారం కూడా ఏ రోడ్ బాగుడదని ...తాజా స్టేటస్ చూస్తే తెలిసిపోతుంది. సమయం ముంచుకొచ్చినా ఎక్కడా పనులు జరగడంలేదు. 



దీనిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం జగన్ జూలై 15వ తేదీన డెడ్ లైన్ పెట్టినందున ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు గుడ్మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్‌తో రోడ్ల దుస్థితిపై క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు.