భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వ్యూహాలు అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. వారు ఏ వైపు నుంచి ఎటాక్ చేస్తారో ప్రత్యర్తి పార్టీలకు అర్థం కావడం కష్టం. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా సంక్షోభంలో పడుతున్నాయి. ముఖ్యమంత్రులు మారిపోతున్నారు. మరికొంత మంది టెన్షన్ పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో .. దాని వెనుక ఎలాంటి రాజకీయం ఉందో అర్థం కాని పరిస్థితి. అయితే ప్రాంతీయ పార్టీలు ఏకం కాకుండా.. వారందర్నీ బలహీనం చేసే ప్రయత్నం చేస్తోందని.. వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌ను బలహీనం చేసే ప్రయత్నంలో భాగంగానే అతి పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్న  అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ప్రారంభమయింది. 


కేసీఆర్ కలిసిన తర్వాతే మహారాష్ట్ర సీఎంపై గురి పెట్టిన  బీజేపీ ! 
 
దేశంలో పలు బీజేపీయేతర ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడ్డాయి..ఇంకా పడుతున్నాయి. కొద్ది  రోజుల కిందట మహారాష్ట్రలో ఆపరేషన్ పూర్తయింది. అక్కడ ప్రభుత్వం మారిపోయింది. ఉద్దవ్ ధాకరే సీఎం  పదవి నుంచి దిగిపోయారు. ఉద్దవ్ అంతకు కొద్ది రోజుల ముందే సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ప్రత్యేకంగా బృందాన్ని తీసుకుని మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ ... ఉద్దవ్ ధాకరేతో బీజేపీని ఎలా ఓడించాలా అని చర్చలు జరిపారు. కొద్ది రోజులకే ఆయన  పదవిని కోల్పోయారు. ఉద్దవ్ ధాకరే తన పార్టీ శివసేనపై అసలు పట్టు లేకుండా ఉన్నారని..  ఎమ్మెల్యేలు మొత్తం పోలోమని పోతున్నా ఆపలేని పరిస్థితికి వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ జరిగిపోయింది. ఆపరేషన్ కమలం మహారాష్ట్రలో పూర్తయిపోయింది. కేసీఆర్ బీజేపీపై పోరాటంలో కలసి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఓ బలమైన ప్రభుత్వం కూలిపోయింది. 


జార్ఖండ్‌ సీఎం పదవీ పోయింది !


కేసీఆర్ బీజేపీపై పోరాటంలో కలసి వస్తారని నమ్ముకున్న  మరో సీఎం హేమంత్ సోరెన్ . సోరెన్ కూడా పదవిని కోల్పోతున్నారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు జార్ఖండ్‌లో ప్రభుత్వం ఉంటుందా.. బీజేపీ ట్రేడ్ మార్క్ రాజకీాయలు చూపిస్తుందా ? అనేది వచ్చే వారం రోజుల్లో క్లారిటీ రానుంది. జార్ఖండ్ సీఎం సోరెన్‌ పార్టీ జేఎంఎం కు తెలంగాణకు ఎన్నికల కోసం నిధులు ఉందాయన్న ప్రచారం కూడా ఉంది. హేమంత్ సోరెన్ పలుమార్లు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు కూడా. ఆ తర్వాతే బీజేపీ ఆయనను గట్టిగా ఓ చూపు చూసిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


టెన్షన్ పడుతున్న కేజ్రీవాల్ ! 


కేసీఆర్ ఇటీవల కలిసిన మరో సీఎం అరవింద్ కేజ్రీవాల్.   ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టెన్షన్ పడుతున్నారు. ఆయన తన పార్టీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు రూ. 800 కోట్లు రెడీ చేసిందని ఆరోపిస్తున్నారు. ఓ మంత్రి జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.  కేజ్రీవాల్ కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమై బీజేపీ పతనం కోసం చేయాల్సిన రాజకీయాలపై చర్చించారు.   ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్‌తో కలిసి ఓ రోజంతా పర్యటిచారు. పంజాబ్‌లో చెక్కులు పంపిణీ చేశారు. మద్యం పాలసీ స్కాం అంతా తెలంగాణ నుంచే జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కూడా. ఇప్పుడు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఆయనకో సవాల్‌గా మారిందనడంతో సందేహం లేదు. 


తర్వాత ఎవరు ? కేసీఆరా ? స్టాలినా ?


బీజేపీని తీవ్రంగా విభేదించే ప్రభుత్వాలు... కాంగ్రెసేయతర ప్రభుత్వాలు దక్షిణాదిలో ఉన్నాయి. కేరళ పై బీజేపీ దృష్టి తగ్గించింది. ఒడిషా, ఏపీల్లో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒడిషా వెళ్లి కేసీఆర్ .. నవీన్ పట్నాయక్‌ను కలిసినా ఆయన జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టరు. ఏపీ సీఎం జగన్ కూడా అంతే. ఇక కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమైంది తమిళనాడు సీఎం స్టాలిన్‌తోనే. అయితే తమిళనాడులో ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి కానీ.. లేకపోతే ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం కానీ చేసే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. స్టాలిన్‌ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక మిగిలింది.. కేసీఆర్  మాత్రమే. కేసీఆర్‌ను ఇప్పటికే రాజకీయంగా దిగ్బంధనం చేస్తున్నారు. ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఏకనాథ్ షిండేలు ఉన్నారని బహిరంగంగానే చెబుతున్నారు. మరో వైపు దర్యాప్తు సంస్థలు విరుచుకుపడే అవకాశాలు లిక్కర్ స్కాం వంటి వ్యవహారాల్లో కనిపిస్తున్నాయి. దీంతో నెక్ట్స్ టార్గెట్ కేసీఆరే అన్న అంచనాకు ఎక్కువ మంది వస్తున్నారు. 


ప్రాంతీయ పార్టీలను బలంగా దెబ్బకొడుతున్న బీజేపీ.. వారంతా ఏకమయ్యే అవకాశాలు లేకుండా చేస్తోంది. జాతీయ రాజకీయాలపై ఆ పార్టీలు దృష్టి పెట్టలేని విధంగా చేస్తోంది. ఈ విషయంలో నెక్ట్స కేసీఆరే కావొచ్చు.. ఆ తర్వాత స్టాలిన్.. ఆ తర్వాత  విజయన్ కూడా ఉండొచ్చు. అయితే  బీజేపీ వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చినంత కాలం ఈ హవా సాగుతుంది. వారికి కౌంటర్ ఇచ్చే నేత వచ్చినప్పుడు బ్రేక్ పడుతుంది. ఆ నేత కేసీఆర్ కూడా కావొచ్చు.. ఎవరూ చెప్పలేరు !