AIMIM AP Local Elections Contest 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనూహ్యంగా బరిలోకి దిగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి షేక్ నాసిం భానును అభ్యర్థిగా నిలపడంతో పాటు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠానికి కాంగ్రెస్ మాజీ నేత ఇమ్రాన్ బాషాను బరిలోకి దించడం సంచలనంగా మారింది. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ జనాభా నిర్ణయాత్మకంగా ఉన్న దాదాపు 21 కీలక వార్డులు, స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందనేది స్పష్టమవుతోంది.
ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్న మజ్లిస్
హైదరాబాద్ పాతబస్తీకే పరిమితం కాకుండా మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న ఒవైసీ.. ఇప్పుడు ఏపీని కూడా తన రాజకీయ విస్తరణకు వేదికగా ఎంచుకుంటున్నారు. కడప, హిందూపురం, నంద్యాల, కర్నూలు, విజయవాడ వంటి ప్రాంతాలలో ముస్లిం మైనార్టీలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ మైనార్టీ ఓటు బ్యాంకు అత్యధిక భాగం సాంప్రదాయకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎంఐఎం బరిలోకి దిగడం వల్ల ఈ ఓట్లలో చీలిక ఖాయమని, ఇది నేరుగా ప్రైమరీ ఆపోజిషన్ పార్టీ అయిన వైసీపీ విజయావకాశాలపైనే ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
కడప మేయర్ స్థానంలో ఓట్లు చీలితే కష్టమే
ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడప మేయర్ పీఠంపైన, సీమలో వైసీపీ కంచుకోటలుగా ఉన్న మైనార్టీ పాకెట్లలోనే ఎంఐఎం దృష్టి పెట్టింది. ఓటుకు ప్రత్యామ్నాయం లేక వైసీపీకి మద్దతు ఇస్తున్న మైనార్టీ వర్గాలకు సొంత సామాజిక ప్రాతినిధ్యం కల్పించే రాజకీయ వేదికగా తమను తాము మలుచుకోవడానికి మజ్లిస్ ప్రయత్నిస్తోంది. కూటమి వైపు ముస్లిం ఓట్లు మళ్లే అవకాశాలు తక్కువగా ఉన్న వాతావరణంలో.. ఎంఐఎం చీల్చే ప్రతి ఓటు వైసీపీ ఓటు బ్యాంకు నుంచే కోత పడుతుందనడంలో సందేహం లేదు.
ఫలితాలు కనిపిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ
అయితే, మజ్లిస్ ఏపీలోకి ప్రవేశించడం వెనుక ఉన్నది కేవలం ఒక స్థానిక ఎన్నికల గెలుపోటముల వ్యూహమేనా లేక సుదీర్ఘ రాజకీయ ప్రణాళికా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పరచుకోవడానికి, ఈ స్థానిక పోరును ఒక టెస్టింగ్ గ్రౌండ్ గా ఒవైసీ వాడుకుంటున్నారని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో కనీసం కొద్దిపాటి సీట్లు సాధించినా లేదా గణనీయమైన ఓటు శాతం నమోదు చేసినా.. రాబోయే రోజుల్లో ఏపీ అసెంబ్లీ రేసులోనూ ప్రధాన పార్టీలకు పోటీగా నిలబడటానికి ఎంఐఎంకు పటిష్టమైన పునాది దొరుకుతుంది.
ఓవైసీకి పెద్ద ప్లానే ఉంది!
ఎంఐఎం పోటీ చేయడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర అంతర్మథనంలో పడ్డాయి. మజ్లిస్ అభ్యర్థుల వల్ల తమ గెలుపు మార్గం క్లిష్టంగా మారుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న కూటమికి ప్రత్యక్షంగా మేలు చేసేందుకే ఎంఐఎం ఓట్లను చీలుస్తోందనే ఆరోపణలను వైసీపీ నేతలు తెరపైకి తెచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, మజ్లిస్ నేతలు మాత్రం రాజకీయాల్లో పోటీ చేసే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది, ముస్లింల సంక్షేమం మరియు ఆత్మగౌరవం కోసమే మేము ఏపీలో స్వతంత్రంగా పోరాడుతున్నాం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ స్థానిక పోరులో మజ్లిస్ సాధించే ఓట్ల శాతం , సీట్లు ఏపీ రాజకీయ సమీకరణాలను మలుపు తిప్పనున్నాయి. కడప, హిందూపురం వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఎంఐఎం బరిలో ఉండటం వల్ల త్రిముఖ పోటీ ఏర్పడి ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేకెత్తించనున్నాయి.
