Telangana Modi action plan ready: పశ్చిమ బెంగాల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ అధిష్టానం, ఇప్పుడు తన విజయ యాత్రను దక్షిణ భారతం వైపు మళ్లించింది. 15 ఏళ్ల కిందట బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు 207 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఉన్న సైలెంట్ ఆపరేషన్ వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సభ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు.
జీరో నుంచి హీరోగా.. బెంగాల్ మోడల్ తెలంగాణలో!
బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ఉద్ధండురాలిని ఓడించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎంపీల బలంతో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ సభ ద్వారా సుమారు 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే, రాజకీయ మార్పుకు మోదీ పిలుపునివ్వనున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. విజయ్ సంకేతం!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది తామేనని మోదీ ఈ సభ ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు టీమ్ మోదీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.
అండర్ కరెంట్ వ్యూహాలు.. సైలెంట్ ఆపరేషన్
బెంగాల్‌లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు!
మోదీ మే 10 పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభానికే పరిమితం కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ బహిరంగ సభ. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష ఇండియా కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి త్రిముఖ పోరు నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
