Vijay Latest News: తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి కంటే నటుడు విజయ్‌ పెట్టిన టీవీకే పార్టీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి చాలా రకాలుగా విమర్శలు పుకార్లు వస్తూనే ఉన్నాయ. అన్నింటిపై విజయ్ స్పందించారు. తన రాజకీయ పంథా, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ప్రకటన చేశారు. ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ తాను కేవలం ప్రజల టీమ్‌ అని తేల్చి చెప్పారు. 

పుకార్లకు స్వస్తి

విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని, లేదా ఫలానా రాజకీయ కూటమికి బీ టీమ్ గా ఉంటారని సోషల్ మీడియాలో, రాజకీయ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై ఆయన నేరుగా స్పందించారు. మనం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మన గురించి ఆ టీమ్‌ అని ఈ టీమ్ అని ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే ఈ నిందలన్నీ ప్రజల దృష్టిలో వీగిపోయాయని, తాను కేవలం ప్రజల కోసం పని చేసే పీపుల్స్‌ టీమ్‌ అని అందరికీ అర్థమైందని విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తనపై వేయడానికి ఇంకే నిందలు లేక చివరకు త్వరలో ఏదో ఒక కూటమితో చేతులు కలపబోతున్నాననే కొత్త అబద్ధపు ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. ఈ గందరగోళానికి తెరదించుతూ, తాను ఎవరితోనూ కలవడం లేదని ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో పోరాడుతానని స్పష్టం చేశారు. 

చెన్నైలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ఏఐఏడీఎంకే-బీజేపీతో ఎలాంటి పొత్తు చర్చలు లేవని చెప్పారు. తన పార్టీ సెక్యులరిజమ్‌, సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉందన్నారు. ఈ సిద్ధాంతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

మన నాయకత్వంలోనే పాలన ఉండాలని అే విషయంలో ఎప్పుడూ దృఢంగానే ఉన్నామని, అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. తన మొదటి మహాసభలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నానని, రాజకీయాల్లో ఎవరి కోసమైనా, దేని కోసమైనా రాజీ పడటం  అనే చర్చకే తావు లేదని పునరుద్ఘాటించారు.  

తనపై వస్తున్న నిందలను నమ్మొద్దని విజయ్ ప్రజలు సూచించారు. ప్రత్యర్థులు చేసే కుట్రలు తన లక్ష్యాన్ని అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు.  సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి దయతో మనం అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం అని చెప్పారు. 

రాజకీయ శత్రువు డీఎంకే అని, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని బహిరంగంగా ప్రకటించిన విజయ్, తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆయన వెళ్లిన ప్రతిచోటా మంచి ఆదరణ లభించినప్పటికీ, కరూర్‌లో ఆయన ప్రచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటన ఆయన రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది.

ఈ ఘటన తర్వాత, సీబీఐ విచారణలో చిక్కుకున్న విజయ్, నెల రోజుల తర్వాతే ఇంటి నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఆయన రాజకీయంగా యాక్టివ్ అయినప్పుడు 'జన నాయకన్' సినిమాపై నిషేధం, భార్య సంగీత నుంచి విడాకులు, ఇతర ఆరోపణలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.  

ఈ క్రమంలోనే డీఎంకేను ఓడించేందుకు విజయ్‌ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చేరతారని ప్రచారం జరిగింది. దీనికి పవన్ మధ్యవర్తిత్వం సాగిస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. తర్వాత త్రిష కూడా అమిత్‌షాతో సమావేశమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటినీ పుల్‌స్టాప్ పెడుతూ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చేరబోనని విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. 

టీవీకేను లౌకిక పార్టీగా ప్రకటించి, బీజేపీని రాజకీయ శత్రువుగా పేర్కొంటూ ఆ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకుంటే, అది తన పార్టీ భవిష్యత్తుకు ఎదురుదెబ్బ అవుతుందని ఆయన మద్దతుదారులు, అభిమానులు భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ కూటమితో పొత్తు లేదని ప్రకటించిన విజయ్‌ వచ్చే ప్రభుత్వం టీవీకే నేతృత్వం వహిస్తుందని స్పష్టంగా చెప్పారు.