గోవా చిన్న రాష్ట్రమే కానీ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. అందుకే గోవాలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. మనోహర్ పారీకర్ లేని ఎన్నికలు కావడంతో ఈ సారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న చర్చ సహజంగానే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ఏబీపీన్యూస్ - సీ ఓటర్ చేసిన ప్రయత్నంలో హంగ్ అసెంబ్లీ వస్తుందనివెల్లడయింది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు.


మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీన్యూస్ - సీ ఓటర్ తాజాగా చేసిన సర్వేలో తేలింది. భారతీయ జనతా పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అయితే ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా కాస్తంత ముందంజలో ఉంది. బీజేపీకి 14 నుంచి 18 సీట్లు లభించే అవకాశం ఉంది. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ప్రజల మనసుల్లో కాస్త చోటు సంపాదించబోతోంది. ఆ పార్టీకి 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కింగ్ మేకర్‌గా ఆమ్ ఆద్మీ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ పార్టీకి మూడు నుంచి ఏడు స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇతరులు సున్నా నుంచి రెండు చోట్ల గెలిచే అవకాశం ఉందని ఏబీపీన్యూస్ - సీ ఓటర్ సర్వేలో వెల్లడయింది.


ఇక ఓట్ల షేర్ ప్రకారం చూస్తే బీజేపీకి 30శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 23.6 శాతం ఓటర్ల మద్దతు ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లను కాస్త తక్కువగా పొందినప్పటికీ 24 శాతం మంది ఓటర్లు ఆ పార్టీ వైపు ఉన్నారు. మిగతా ఓట్లను మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఇండిపెండెంట్లు పొందే అవకాశం ఉంది. 


గోవాలో ఏ పార్టీకైనా పూర్తి మెజార్టీ రావడం కష్టమే. ఎంజీపీతో పాటు ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తూ ఉంటారు. సంకీర్ణాన్ని నడపడంలో మనోహర్ పారీకర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నిజాయితీ పరుడైన లీడర్. ఈ కారణంగా మద్దతు ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత ఇప్పుడు సంకీర్ణాన్ని నడపాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రెండు, మూడు సార్లు సంక్షోభంలో పడటమే దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో గోవా రాజకీయాలు ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.