Andhra Politics :   ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును  స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కాం జరిగిందని అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. క్వాష్ పిటిషన్ వేశారు. వాదనలు వినిపించడానికి.. కౌంటర్ వేయడానికి ప్రభుత్వం రెండు వారాల సమయం అడిగింది.. దీంతో జడ్జి వారం రోజుల సమయం ఇచ్చారు. బెయిల్ పిటిషన్ వేసే విషయంలోనూ చంద్రబాబు ఆసక్తిగా లేరు. దీంతో క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగి నిర్ణయం వచ్చే వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగానే రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ప్రతీ రోజూ ప్రముఖుల ములాఖత్‌లు ఉండేలా టీడీపీ ఏర్పాట్లు


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది ప్రకటనలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఒక్క వైసీపీ నేతలు మినహా అందరూ ఖండించారు. వీరందరూ చంద్రబాబును స్వయంగా కలిసి సంఘిభావం చెప్పేందుకు వచ్చేలా టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్లుాగ తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురువారం చంద్రబాబును కలవనున్నారు. ఆయనతో పాటు  బాలకృష్ణ కూడా ఉంటారు. రేపంతా ఈ అంశం హాట్ టాపిక్ అవుతుంది.  ఆ తర్వాత రోజుల్లో కూడా ఊహించని వీఐపీలు.. ములాఖత్‌క వచ్చి చంద్రబాబును పరామర్శించేలా..మద్దతు తెలిపేలా సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే వారం రోజులు.. రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టే రాజకీయాలు తిరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


ఇంటింటికి టీడీపీ - చంద్రబాబుపై కేసు అక్రమమని పూర్తి వివరాలతో నోట్ 


మరో వైపు  టీడీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంది.   చంద్రబాబుతో  మేముంటామని.. ఆయనను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఒక్క ఆధారం లేకపోయినా అరెస్ట్ చేశారని.. పిల్లలకు మంచి  భవిష్యత్ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పిస్తే  అరెస్ట్ చేశారని చెబుతూ.. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గా ల కేంద్రంగా బాబుతో మేము అనే ఓఎమోషన్ పెంచేందుకు స్ట్రాటజిక్ గా ప్రయత్నిస్తున్నారు.  రాజకీయాల్లో సానుభూతి అస్త్రం గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆయనను అన్యాయంగా వేధిస్తున్నారని ప్రజలు అనుకుంటే.... టీడీపీ అడ్వాంటేజ్ వస్తుంది. వచ్చే వారం రోజులూ ఈ కేసు విషయంలో పూర్తిగా చర్చ నడుస్తుంది. ఎలా చూసినా.. చంద్రబాబుకు ఇందులో ఒక్క రూపాయి అందినట్లుగా సీఐడీ చెప్పడం లేదు. కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో  తప్పుడు అని కోర్టు ద్వారా చెప్పిస్తే.. జగన్ సీఎం జగన్ అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతను కుట్రపూరితంగా జైల్లో పెట్టే ప్రయత్నం చేశారని కోర్టు ద్వారా చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. 


చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడేనా?  


చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారన్న  వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది.   చంద్రబాబు  కుంగిపోవడం అనేది ఉండదని.. రాజకీయ వేధింపులను కూడా రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొంటారని అంటున్నారు.  ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులుజైల్లో ఉంచలేరని ఆయనకు తెలుసని.. అందుకే... వీలైనంత గా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.  చంద్రబాబు రాజకీయం ఊహించని విధంగా ఉంటోందని చెబుతున్నారు.   ఇంకా ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టి.. లోకేష్ .. పవన్ కల్యాణ్ నూ అరెస్టు చేసి...  ఆ తర్వాత ఎన్నికలకు  వెళ్తుందన్న ప్రచారం బయట జరుగుతోంది.  రాజకీయాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సానుభూతి పవనాలు వీస్తే..  ఆయా పార్టీలకు తిరుగు ఉండదు. పైగా చంద్రబాబు గతంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో చేశానని.. చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అడిగితే.. .. ప్రజలు కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయని అంచనా వేస్తున్నారు.