3 Years of YSR Congress Party Rule :   జగన్ అంటే వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ఆర్‌సీపీ అంటే జగన్. పార్టీపై సీఎం జగన్‌కు ఉన్న పట్టు అలాంటిది. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత ఒక్క సారిగా సీన్ మారిపోయింది. అసంతృప్తి వెల్లువెత్తింది. అయితే సహజంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్‌తో అప్పటికప్పుడు సద్దుమణిగేలా చేయగలిగారు. కానీ రాజకీయాల్లో అసంతృప్తి అంటూ ప్రారంభమైతే అవకాశాలు కనిపించినప్పుడు అది వెల్లువలా బయటకు వస్తుంది. వైఎస్ఆర్‌సీపీలో ఇలాంటి అసంతృప్తి ఉందా? జగన్ నాయకత్వంపై అవకాశాలు రాని వారు ఇంకా గుర్రుగా ఉన్నారా..? మూడేళ్ల పాలన తర్వాత పార్టీపై అదే పూర్వ స్థాయిలో జగన్ పట్టు కొనసాగుతోందా ? 


జగన్ చెప్పిందే వైఎస్ఆర్‌సీపీలో వేదం..మొన్నటి వరకు ! 



వైసీపీలో జగన్ ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు ! ఆయన మాటకు తిరుగులేదు. మంత్రి పదవుల్ని ప్రకటించే వరకూ ఇదే. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపించింది.  ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కావడం… జగన్‌తో నడిచిన వారు ఎక్కువగా ఉండటం.. సామాజిక సమీకరణాల పేరుతో దూరం పెట్టడం వంటి కారణాల వల్ల ఈ అసంతృప్తి వచ్చింది. అయితే బయటపడుతుంది అని ఎవరూ అనుకోలేదు. రోడ్డెక్కుతారని.. రాజీనామాల వరకూ వెళ్తారని భావించలేదు. కానీ ఇక్కడ బాలినేనిశ్రీనివాస రెడ్డి, సుచరిత వంటివాళ్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమకు ఎమ్మెల్యే పదవులు కూడా వద్దన్నారు. చివరికి సర్దుబాటు చేసుకున్నారు. ఇక స్థానం ఆశించి భంగపడిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి గురయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సుచరిత వంటి తాజా మాజీ మంత్రులు … పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారధి వంటి సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు.బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇక రాజీనామా చేస్తారేమోనన్నంతగా ప్రచారం జరిగింది.  బాలినేని సహా అందరూ పిన్నెల్లి, సామినేని ఉదయభాను ఇలా అందర్నీ పిలిచి జగన్ మాట్లాడారు. మళ్లీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


హామీలతో అసంతృప్తిని చల్లార్చేసిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ! 


మంత్రివర్గ విస్తరణ సమయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన అందరూ  అందరూ తమకేమీ అసంతృప్తి లేదని.. పార్టీ కోసం పని చేస్తామని ప్రకటించేశారు.  దీంతో కథ సుఖాంతమైంది.  తమ అనుచరులతో ఆందోళనలు చేయించిన వారంతా జగన్‌ను కలిసి .. అసంతృప్తేమీ లేదని ప్రకటించేశారు. మొత్తం వ్యవహారాన్ని సీఎం జగన్ టీ కప్పులో తుఫాన్‌గా తేల్చేశారు. ఎక్కువగా ఆశలు పెట్టుకుని భంగపడిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడి సర్ది చెప్పారు. మంత్రి పదవి రాకపోయినా పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గదని వారికి హామీ ఇచ్చారు. దాంతో వారంతా.. తమకేమీ అసంతృప్తి లేదని ప్రకటించారు. అందరికి ఎవో పదవులు ఇస్తామని.. లేకపోతే మరోసారి గెలిచినప్పుడు మంత్రి పదవి ఖాయమని హామీ ఇవ్వడం ద్వారా వారిని వారి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయగలిగారు. 


అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందా ?


మంత్రివర్గం మార్చిన తర్వాత మాజీ మంత్రులకు జిల్లాల బాధ్యతలిచ్చారు. కేబినెట్ హోదా తగ్గకుండా చూసుకుంటున్నారు. కానీ చాలా మంది మాజీ మంత్రులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గతంలోలా విమర్శించడం లేదు.  మంత్రి పదవులు పోయిన కొందరు.. మంత్రి పదవులు వస్తాయని కొందరు… మంత్రి పదవులు నిలబెట్టుకునేందుకు కొందరు అప్పట్లో తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ అధ్యక్షుడిపైనా.. జగన్ మనసు మెప్పించేలా విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు అలాంటి వాయిస్‌లు ఎక్కువగా వినిపించడం లేదు. ఈ అంశంపై పార్టీ నేతల తీరుపై జగన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వైఎస్ఆర్‌సీపీలో ప్రచారం ఉంది. ఇది కూడా ఓ రకంగా అసంతృప్తేనని భావిస్తున్నారు. అయితే బయటపడింది కొంతేననని.. మనసులో గూడు కట్టుకుపోతున్నది చాలా ఉందని వైఎస్ఆర్‌సీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.