Year Ender 2022 TDP : తెలుగుదేశం పార్టీకి కాస్త ఉత్సాహం తెచ్చిన ఏడాది 2022. ఈ ఏడాది లో టీడీపీ పరిస్థితి మెరుగుపడింది అనే చెప్పాలి . 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిరాశ లో కూరుకు పోయిన టీడీపీ కి మూడేళ్ళ తర్వాత మళ్ళీ జోష్ నింపిన ఏడాది గా 2022 ను చెప్పుకోవచ్చు . ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండీ అధికార వైసిపీ పై ఆరోపణల దాడి చేస్తూనే వస్తున్నా చంద్రబాబు అండ్ టీమ్ కు 2022 లో ప్రజలనుండి స్పందన లభించింది . ఈ ఏడాది టీడీపీ చేపట్టిన ప్రభుత్వ విధానాల పై విమర్శలు గుప్పించే కార్యక్రమానికి 2022 లో ప్రజల నుండి కూడా అనూహ్య మద్దతు లభించింది .
ఊదిన బాదుడే బాదుడు , ఇదేం ఖర్మ కార్యక్రమాలతో ప్రజల్లోకి !
గత మూడేళ్ళుగా అధికార వైసీపీ నీ ,సీయం జగన్ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నా ప్రజల నుండి పెద్దగా టీడీపీ కి స్పందన రాలేదు . ముఖ్యంగా 151 సీట్ల తో తిరుగులేని మెజారిటీ సాధించిన జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి అప్పటికి ఏర్పడలేదు . దానికి తోడు వైసిపీ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తున్న సంక్షేమ పథకాల హోరులో విపక్షాల ఆరోపణలు ప్రజలకు కనపడనే లేదు . అయితే ఎడాపెడా పెరిగిపోతున్న చార్జీలు , ధరలు ,చెత్త పన్ను విధింపు లాంటి చర్యలను టీడీపీ ఈ ఏడాది చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలనుండి బానే మద్దతు లభించింది . ఆ ఉత్సాహంతో టీడీపీ తాజాగా చేపట్టిన "ఇదేం ఖర్మరా బాబూ " కార్య్రక్రమానికి కూడా జనాలనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది . ఈ కార్యక్రమంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి టీడీపీ గట్టి పోటీనే ఇచ్చింది . దీనితో పాటు పార్టీ పరంగా చేపట్టిన మినీ మహానాడు కార్యక్రమాలు పార్టీ కేడర్ లో మళ్ళీ జోష్ ను నింపాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి .
కేసుల భయం నుండి బయటకు వస్తున్న కీలక నేతలు
గత మూడేళ్ళుగా తమపై ఎక్కడ కేసులు పెడతారో అన్న భయంతో ప్రభుత్వం పై విమర్శలు గుప్పించడానికి సీనియర్ నేతలు భయపడ్డారని టీడీపీ శ్రేణులే చెబుతాయి . కేవలం చంద్రబాబు ,లోకేష్ ,అయ్యన్నపాత్రుడు .అచ్చెన్నాయుడు , యనమల రామకృష్ణుడు . బుద్ధా వెంకన్న , రామానాయుడు, కెయస్ జవహర్ , అనిత లాంటి కొందరు మాత్రమే క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా కనిపించేవారు . అయితే , ఈ ఏడాది మాత్రం సీనియర్ నేతలు జనాల్లోకి రావడం మొదలుపెట్టారని ,,, పార్టీ అధినేత వచ్చే ఎన్నికల్లో టికెట్స్ కావాలంటే రోడ్డు పైకి రావాల్సిందే అంటూ వార్నింగ్ లు ఇవ్వడం వల్లే వాళ్లలో కదలికలు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు . పార్టీకి కేడర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నా .. లీడర్లు కూడా బయటకు రావడం ఒక శుభ పరిణామం గా టీడీపీ అభిమానులు భావిస్తున్నారు.
టీడీపీ - బీజేపీ లమధ్య ఓ మేర తగ్గిన దూరం
2018 లో టీడీపీ చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు నుండి బీజేపీ తో పెరిగిన దూరం 2022 లో ఓ మేర తగ్గింది .ఇ టీవల ఢిల్లీలో చంద్రబాబుతో ప్రధాని మోదీ పలకరింపుల తర్వాత బీజేపీ నేతలు టీడీపీ పై విమర్శలు తగ్గించారు . 2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ రెడీ చేసుకుంటున్న ప్లాన్-బీ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ తో మైత్రి సంకేతాలు అని ఎనలిస్టులు లెక్కలు గట్టినా .. టీడీపీ కి అయితే ఇది రాజకీయంగా కలిసి వచ్చే అంశమేనని అంచనా వేస్తున్నారు.
జనసేన తో మైత్రికి సంకేతాలు
2019 ఎన్నికల నుండీ జనసేన టీడీపీ మధ్య మళ్ళీ మైత్రి ఏర్పడుతుంది అని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు చెలరేగినా పవన్ విశాఖ ఎపిసోడ్ తర్వాత అది బలపడింది . ఏకంగా చంద్రబాబు వెళ్లి పవన్ పరామర్శించడం తో జనసేన తో టీడీపీ పొత్తు ఇక లాంఛనమే అన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది . అయితే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళతారా .. లేక విడివిడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత కలుస్తారా అన్నది 2023 లోనే తేలాల్సివుంది .
చంద్రబాబు కు కొత్త దారి ఏర్పాటు చేసిన కేసీయార్ -బీఆర్ యస్ పార్టీ
2014 తర్వాత రోజురోజుకీ తెలంగాణా లో బలహీన పడుతూ వచ్చిన టీడీపీ నెత్తిన పాలుపోసారు కేసీఆర్ అనే విశ్లేషణ రాజకీయాల్లో మొదలైంది . ఇంతవరకూ తెలంగాణ లో ఆంధ్ర పార్టీలు ఎందుకు అంటూ కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు తన జాతీయ పార్టీ బీఆర్ యస్ ద్వారా ఏపీలో కూడా పోటీకి రెడీ అవుతున్నారు . దీనిని సాకుగా చూపి చంద్రబాబు ఖమ్మం లో ఇటీవల జరిపిన పర్యటనలకు భారీ స్పందనే వచ్చింది .దానితో తెలంగాణ లో టీడీపీ కి క్రొత్త ఆశలు వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఇది 2022 లో టీడీపీ కి సంబంధించిన అతి పెద్ద పరిణామం అనుకోవచ్చు.
లోకేష్ పాదయాత్ర పై భారీ ఆశలు
నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థుల నుండి అనేక విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్ ఈ ఏడాది పూర్తిగా గేరు మార్చారు . మంగళగిరి సహా రాష్ట్రం అంతా ఆయన చేసిన పర్యటనలు ..మాట్లాడే తీరు ..జనాలతో కలిసిపోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు జనాలనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది . దీనిని బేస్ చేసుకుని 2023 జనవరి నుండి ఆయన చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర పై టీడీపీ భారీ అసలే పెట్టుకుంది .
పార్టీ పార్టీ పుంజుకుంది .. కానీ
2019 తో పోలిస్తే టీడీపీ పార్టీ పరంగా 2022 లో పుంజుకుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏకంగా 151 సీట్లతో ధీమాగా ఉన్న అధికార వైసీపీ ని ఓడించడానికి ఈ జోష్ సరిపోదు అనే వాదనలు ఉన్నాయి . చంద్రబాబు .లోకేష్ ఎంతగా కష్టపడుతున్నా పార్టీ లోకి యువతరాన్ని ఆకర్షించడం , క్షేత్ర స్థాయి కార్యకర్తలకు పెద్దపీట వేయడం , ప్రభుత్వ విధానాల లోని లోపాలను మరింత సమర్ధవంతంగా జనాల్లోకి తీసుకెళ్లడం లాంటి చర్యలు చేపడితేనే 2024 లో తాము అనుకున్న గమ్యాన్ని టీడీపీ చేరుకుంటుంది అని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు .మరి ఆ దిశగా అడుగులు 2023 లో ఏ మేర పడతాయన్నది చూడాలి