Space Interesting Facts: భూమి మీద భూకంపాలు లాగే, అంతరిక్షంలో ప్రకంపనలు వస్తాయా ? స్పేస్ గురించి ఆసక్తికర విషయాలు
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తాలి అనుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాలలో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే, భూకంపం గురించి తెలిసిన మీరు ఎప్పుడైనా స్పేస్ కంపించడం గురించి విన్నారా?
భూమిపై భూకంపాలు వచ్చినట్లే, అంతరిక్షంలో కూడా ప్రకంపనలు వస్తాయి. వాటిని స్పేస్‌కేక్ (Spacequake) అంటారు. అంతరిక్షంలో వచ్చే ప్రకంపనలు భూమిపై వచ్చే భూ ప్రకంపనలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
నిజానికి, భూమిపై భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ల వల్ల సంభవిస్తాయి. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు రాపిడి జరిగి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు, భూ ప్రకంపనలు అనిపిస్తాయి. దాన్నే మనం భూకంపం అని పిలుస్తాం. కానీ అంతరిక్షంలో ఇలా జరగదు.
అయస్కాంత క్షేత్రంలో శక్తి అధిక కదలిక కారణంగా అంతరిక్షంలో ప్రకంపనలు వస్తాయి. దీని ప్రభావం భూమిపై కూడా పడుతుంది. మన భూమి చుట్టూ ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉంటుందని తెలిసిందే. ఈ అయస్కాంత క్షేత్రాన్ని మాగ్నెటోస్పియర్ అంటారు.
అంతరిక్షం నుంచి భూమి వైపు వచ్చే హానికరమైన కిరణాలు, సౌర వికిరణం నుండి మాగ్నెటోస్పియర్ లేదా అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. అయినా కొన్నిసార్లు సూర్యుడి నుండి వచ్చే సౌర గాలుల ప్రవాహం చాలా వేగంగా మారుతుంది. ఇవి అయస్కాంత క్షేత్రంతో ఢీకొనడంతో ఒత్తిడి ఏర్పడుతుంది. దీని ఫలితంగా స్పేస్‌కేక్స్ ఏర్పడతాయి.
భూమిపై సంభవించే భూకంపాల వల్ల భవనాలు కూలిపోవడం, భూమిపై పగుళ్లు ఏర్పడటం చూస్తుంటాం. అయితే, అంతరిక్షంలో సంభవించే భూకంపాల వల్ల విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడతాయి. ఇవి ఉపగ్రహాలతో పాటు విద్యుత్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.