SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, అవసరమైతే రోబోలు వాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC Tunnel) టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజుకు చేరింది. అయినా లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనిపించడం లేదు. గ్రౌండ్ పెనేట్రేటెడ్ రాడార్ (GPR) పరికరంతో టన్నెల్ లో గుర్తించిన మార్కింగ్ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంటకు వెళ్లి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) వద్దకు వెళ్లి పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఎందుకంత టైమ్ పడుతుందో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు, రెస్క్యూ టీమ్ తెలిపింది.
GPR రాడార్ గుర్తించిన నాలుగు చోట్ల 5 నుంచి 12 మీటర్ల మేర బురద, మట్టి కూరుకుపోయింది. ఊట నీరు భారీగా ఉబికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు తలెత్తుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కోసం చేపట్టిన రెస్క్యూ టీమ్ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది, కానీ మేం మనోధైర్యం కోల్పోకుండా ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు SLBC ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందని, మీరంతా దీనికి సహకరించాలని కోరారు. అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం SLBC టన్నెల్ పనులను నిర్లక్ష్యం చేసిందని, వర్క్ చేసిన సంస్థకు నిధులు విడుదల చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ లేకపోవడంతో టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని సరఫరా సైతం నిలిపివేశారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టన్నెల్ ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. అమెరికా నుంచి మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ తెప్పించామని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్లగొండ సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చూస్తుంటే ఈ దుర్ఘటన జరిగింది. ఇది అనుకోని ప్రమాదమన్నారు.
కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారిందన్నారు. SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఎలా ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేము. ఆర్మీ, టన్నెల్ ఎక్స్ పర్ట్స్ సహా 11 డిపార్ట్ మెంట్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని తెలిపారు. కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని చెప్పారు.
గతంలో శ్రీశైలం ఎడమ కాలువలో విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే అక్కడికి ఎవ్వరినీ వెళ్లనివ్వలేదు. పీసీసీ అధ్యక్షుడిగా తాను వస్తే జైల్లో పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. SLBC Tunnel లాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా అంతా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా బాధిత కుటుంబానికి అండగా నిలవాలన్నారు.