SLBC Tunnel Rescue operation: టన్నెల్ లో మట్టిని తొలగించాలంటే మరికొన్ని రోజులు పడుతుంది: సింగరేణి సీఎండీ బలరాం
SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందని సింగరేణి సిఎండి బలరాం అన్నారు. NGRI ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దాదాపుగా గుర్తించారని తెలిపారు. కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు చెప్పారు.
శుక్రవారం సాయంత్రం టన్నెల్లో చిక్కుకున్న 8 మంది చనిపోయారని, వారి మృతదేహాలను జీపీఆర్ పరికరం ద్వారా గుర్తించారని సైతం ప్రచారం జరిగింది. బురద కింద కొన్ని అడుగ లోతులో మృతదేహాలు ఉన్నట్లు గుర్తించగా.. తవ్వడానికి టైం పడుతుందని రెస్క్యూ టీమ్ చెప్పినట్లు వైరల్ అయింది.
రాడార్ పిక్చర్స్ వచ్చాకే టన్నెల్ లోపల ఆచూకీ లభించని వారిని గుర్తించే అవకాశం ఉందని సింగరేణి సీఎండీ బలరామ్ తెలిపారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందన్నారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) రెండు ముక్కలైంది. 13.6 కిలోమీటర్ల వద్ద ఒక ముక్క పడగా, 13.9 కిలోమీటర్ల తర్వాత మరో ముక్క పడ్డట్టు రెస్క్యూ టీమ్ గుర్తించారు.
టన్నెల్ లో మట్టిని మొత్తం తొలగించాలంటే కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. కానీ కార్మికుల జాడను తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR) టెక్నాలజీ ద్వారా నిపుణులు తీవ్రంగా యత్నిస్తున్నారు.
జీపీఆర్ ద్వారా ప్రమాద స్థలంలో రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించి, మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా నిర్ధిష్టమైన ప్రదేశంలో కార్మికులు ఉన్నట్టు నిర్ధారణ అయితే కేవలం అదే ఏరియాలో తవ్వకాలు జరుపుతారు.
రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో అయిదు చోట్లు కొన్ని ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితేనే దీనిపై క్లారిటీ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకూ వదంతులు నమ్మవద్దని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మీడియాతో అన్నారు.