Kishan Reddy Wins: కాంగ్రెస్, మజ్లిస్ కుట్రలను ఓటర్లు తిప్పికొట్టారు, నా విజయంలో కీలకపాత్ర వారిదే: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ ఎంపీగా తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ కార్యకర్తలు అందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఎంపీగా విజయం అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 8 స్థానాలను బీజేపీ సాధించడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మండుటెండలను సైతం లెక్కచేయకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వల్లే మంచి ఫలితాలను సాధించగలిగామని పేర్కొన్నారు. కాంగ్రెస్, మజ్లిస్‌లను ప్రజలు తిప్పికొట్టి బీజేపీని బలపరిచారని తెలిపారు.
పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చాక విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరిని కలుస్తానని హామీ ఇచ్చారు.
జూన్ 2వ వారంలో నరేంద్ర మోదీ మరోసారి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.
తన విజయంలో బీజేపీ మహిళా మోర్చా, స్థానిక మహిళా కమిటీల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంచి ఫలితాలను సాధించేలా కృషి చేసిన ప్రతీ అక్కాచెల్లెమ్మళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
యువమోర్చా, ఓబీసీ, దళిత, ఇతర మోర్చాల కార్యకర్తలు సైతం ఎంపీగా తన విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు.
ఆయా కుల, మత, వివిధ సంఘాల వారు, అభివృద్ధి కోరుకుంటూ తన విజయానికి తీవ్ర కృషి చేశారని పేరు పేరున కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 49,944 వేల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై విజయం సాధించారు.
image 11
రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ ఎంపీగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి