Sachin Double Century: సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో 200 బాదేసిన సచిన్! తొలి డబుల్ సెంచూరియన్‌గా రికార్డు!
వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ! ఎందరికో తీరని కల! ఇప్పుడంటే టీ20 మూడ్‌లోకి వెళ్లి ఎడాపెడా ద్విశతకాలు బాదేస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు. 200 మైలురాయి అందుకొనేందుకు ఎడతెగని పోరాటాలు జరిగాయి. ఎన్నో ప్రయత్నాల తర్వాత సచిన్ తెందూల్కర్ తొలిసారి ఈ ఘనత అందుకున్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో తొలి డబుల్ సెంచూరియన్ మన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్. 2010లో సరిగ్గా ఇదే రోజు ఫిబ్రవరి 24న ఆయన డబుల్ సెంచరీ అందుకున్నారు. చరిత్ర పుటలను తిరగ రాశారు. అసాధ్యంగా భావించిన ఫీట్‌ను నిజం చేశారు.
గ్వాలియర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచులో సచిన్ తన విశ్వరూపం చూపించారు. 147 బంతుల్లో 25 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 200 మైలురాయి అధిగమించారు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
ఎప్పట్లాగే తన సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిపి మాస్టర్ బ్లాస్టర్ ఓపెనింగ్‌కు దిగారు. తొలి ఓవర్ నుంచే చక్కగా ఆడారు. సెహ్వాగ్ త్వరగా ఔటైనప్పటికీ సచిన్ మాత్రం దూకుడు ఆపలేదు. కుర్రాడు దినేశ్ కార్తీక్ సాయంతో రెచ్చిపోయాడు.
కార్తీక్‌తో కలిసి రెండో వికెట్‌కు సచిన్ 194 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 79 పరుగుల వద్ద డీకే ఔటవ్వడంతో ఆపై యూసుఫ్ పఠాన్, ఎంఎస్ ధోనీ అండతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 200 అందుకున్నాడు. దాంతో స్కోరు 410/3కు చేరుకుంది.
సచిన్ తర్వాత కుర్రాళ్లు ద్విశతక ఘనత అందుకున్నారు. సెహ్వాగ్ రెండో ఆటగాడిగా అవతరించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదేశాడు. ఈ మధ్యనే ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఈ క్లబ్‌లో చేరిపోయారు.