సమతాక్షేత్రంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక వైభవం-ఎనిమిదో రోజు ఘనంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం
ఆధ్యాత్మిక అద్భుతం సమతామూర్తి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకుని పరవశించిపోయారు.
ఎనిమిదోరోజు వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఆయనతోపాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎనిమిదోరోజు యాగశాలలో ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.
భక్తులతో త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ మంత్ర పఠనం చేయించారు. పెరుమాళ్ స్వామి ప్రాతఃకాల ఆరాధన నిర్వహించారు. అనంతరం తీర్థగోష్ఠి జరిగింది.
ఎనిమిదోరోజు యజ్ఞంలో భాగంగా శ్రీలక్ష్మీనారాయణమహాక్రతవును 114 యాగశాలల్లోని 1035 హోమకుండాల్లో శాస్త్రోత్తంగా నిర్వహించారు 5వేల మంది రుత్విజులు.
ఐశ్యర్యప్రాప్తికి శ్రీలక్ష్మీనారయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధి హయగ్రీవ ఇష్టి పూజను భక్తులతో చేయించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.
దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఆచార్యులు, సాధుసంతులు, పీఠాధిపతులకు స్వయంగా సమతామూర్తిని చూపించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.
108 దివ్యదేశాల గురించి వారికి విపులంగా వివరించారు చిన్నజీయర్ స్వామీజీ. దేశంలోని ఆచార్యులు, సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు జరిగింది. భగవద్రామానుజుల ఉపదేశాలను అందరికీ మార్గదర్శనం అని ప్రబోధించారు.