Coperto Charge:ఆ హోటల్‌లో ఆహారంపైనే కాకుండా ప్లేట్లు, చెంచాలు, ఫోర్క్‌లకి కూడా బిల్లు వేస్తారు; దీని వెనుకున్న కారణమేంటీ?
మీరు రెస్టారెంట్లలో ఆహారానికి మాత్రమే డబ్బు చెల్లించాలి అని అనుకుంటే, ఇటలీకి వెళ్ళిన తర్వాత మీ భ్రమ కచ్చితంగా తొలగిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్లలో మీరు ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు, బిల్లులో కోపర్టో అనే ప్రత్యేక విభాగం చేరుతుంది. ఇది చిట్కా లేదా పన్ను కాదు, కానీ మీ ముందు ఉంచిన టేబుల్, ప్లేట్,ఫోర్క్‌లకు వసూలు చేసే ఛార్జ్.
కోపర్టో ఇటాలియన్ భాషా పదం, దీని అర్థం కవర్ ఛార్జ్. ఇది దాదాపు ప్రతి ఇటాలియన్ రెస్టారెంట్‌లో వసూలు చేసే సాంప్రదాయ రుసుము. దీన్ని సర్వీస్ ఛార్చ్‌గా భావించవద్దు, ఎందుకంటే ఇది వెయిటర్కు ఇచ్చే టిప్ కూడా కాదు. ఈ రుసుములో టేబుల్ క్లాత్, బ్రెడ్, స్పూన్లు-కత్తులు, ప్లేట్లు, కొన్నిసార్లు టేబుల్‌పై ఉంచిన వాటర్ గ్లాస్ వంటి సౌకర్యాల ఖర్చు ఉంటుంది.
సాధారణంగా ఈ రుసుము ఒక్కొక్కరికి €1.50 నుంచి €3.00 వరకు ఉంటుంది (సుమారు 135 నుంచి 270 రూపాయలు). కానీ కొన్ని ప్రీమియం రెస్టారెంట్లు లేదా పర్యాటక ప్రదేశాలలో ఈ ఛార్జ్ €5 వరకు కూడా ఉండవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల ఇది ఇప్పటికే మెనూలో చిన్న అక్షరాలలో రాసి ఉంటుంది, తద్వారా అదనపు ఛార్జీలు ఉంటాయని కస్టమర్‌లకు తెలుస్తుంది.
మధ్యయుగాల నుంచి వస్తున్న ఈ సంప్రదాయానికి ఒక ఆచరణాత్మక కారణం ఉంది. పూర్వకాలంలో, వినియోగదారులు తమ ఆహారాన్ని తెచ్చేవారు, కాని రెస్టారెంట్ పాత్రలు, టేబుల్లను ఉపయోగించేవారు.
ఆ సౌకర్యం కోసమే కోపర్టో ఛార్జ్ ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది ఒక సాంస్కృతిక సంప్రదాయంగా మారింది, ఇది నేటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. కోపర్టో అనేది ఐచ్ఛిక ఛార్జ్ కాదు. ఇది రెస్టారెంట్ పాలసీలో భాగం, కాబట్టి కస్టమర్లు దీన్ని తిరస్కరించలేరు.
అయితే, ఒక రెస్టారెంట్ దానిని మెనూలో స్పష్టంగా పేర్కొనకపోతే, మీరు ఫిర్యాదు చేయవచ్చు, ఎందుకంటే ఇటాలియన్ చట్టం ప్రకారం కాపర్టోను ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయడం అవసరం.