Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు వచ్చారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ లతో పాటు నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ లు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 8.15 గంటలకు వ్యోమగాముల మిషన్ ప్రారంభమైంది. రెండు గంటల అనంతరం అన్ డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు ఉదయం 10.15 గంటల ప్రాంతంలో నలుగురు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో భూమికి బయలుదేరారు.
17 గంటల ప్రయాణం అనంతరం అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో బుధవారం వేకువజామున 3.27 గంటలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ల్యాండ్ అయింది. వెంటనే ప్రొఫెషనల్ స్విమ్మర్ల, టెక్నీషియన్లు క్యాప్సుల్ ను సేఫ్ గా షిప్ లోకి చేర్చారు.
వ్యోమగాములు ఒక్కొక్కరిని స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సుల్ నుంచి టెక్నీషియన్లు బయటకు తీసుకొచ్చారు. సునీతా విలియమ్స్ క్యాప్సుల్ నుంచి బటయకు వచ్చి రిలాక్స్ గా కనిపించారు.
9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినా, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ సునీతా విలియమ్స్ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. మనం సాధించాం అన్నట్లు ఆమె నవ్వుతూ కనిపించారు.
క్యాప్సుల్ నుంచి వ్యోమగాములను బయటకు తీశాక నాసా ఏర్పాటు చేసిన సెంటర్ కు వీరిని తరలించారు. అక్కడ వీరికి కొన్ని రోజులపాటు ఈ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రత్యేక శిక్ష ఇవ్వనున్నారు.
సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సుల్ ను మొదట ఇలా సురక్షితంగా షిప్ లోకి తీసుకొచ్చారు. అనంతరం వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసి, నాసా సెంటర్ కు తరలించారు.