Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ప్రస్తుతానికి అన్ని చోట్లా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ ఇవాళ్టితో ముగియనుంది.
సాధారణ ప్రజలతో పాటు అటు సినీ, రాజకీయ ప్రముఖులూ ఉదయమే పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. తలైవా రజినీ కాంత్ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే వచ్చి ఓటు వేశారు. ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులూ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే దేశాన్ని గౌరవించడమే అని వెల్లడించారు.
సినీ ప్రముఖులు అజిత్, శివకార్తికేయన్, ధనుష్, ఖుష్బూ సుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ విధిగా వచ్చి ఓటు వేయాలని కోరారు. హీరో అజిత్ తిరువణ్మియర్‌లో ఓటు వేశారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలోని కోయంబెడు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి ఆయన పార్టీ ఎన్నికల బరిలో లేకపోయినా అధికార DMKకి మద్దతునిస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని చెప్పారు. ప్రజల అంచనాలు అందుకుంటూ కచ్చితంగా ప్రతిపక్ష కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్టాలిన్‌తో పాటు మరి కొందరు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు. బీజేపీ చీఫ్ అన్నమలై కోయంబత్తూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తేని నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ కూటమే విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉదయమే పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. ఈ మధ్యే ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయింది. శివరాత్రి వేడుకల తరవాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నట్టుండి తలనొప్పితో బాధ పడడం వల్ల హాస్పిటల్‌కి తరలించారు. అక్కడే ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు వైద్యులు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.