Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ప్రారంభం, 45 రోజులపాటు భక్తులతో కిటకిటలాడనున్న ప్రయాగ్ రాజ్
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి పెరిగింది.
అంత చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చిందన్నట్లుగా దేశంలోని నలుమూలల నుంచి కుంభమేళాకు భక్తులు తరలి వెళ్తున్నారు.
ప్రయాగ్ రాజ్‌లో విదేశీ భక్తులు సందడి చేస్తున్నారు. ఓ భక్తురాలు తొలిసారి కుంభమేళాకు వచ్చారు. మేరా భారత్ మహాన్, భారత్ లో ఏదో శక్తి దాగి ఉందని విదేశీ భక్తురాలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది 40 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి చివరి వారం వరకు మహా కుంభమేళా 45 రోజులపాటు వేడుకను తలపించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా కుంభమేళా ప్రసిద్ధి గాంచింది.
ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న కుంభమేళాకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా రావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.