Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.
ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.