Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి

ఫ్రిజ్‌లో నీరు చేరి ఇబ్బంది పెడుతోందా? ఇలా చెక్ పెట్టండి
వర్షాకాలంలో చాలామంది వేసవిలో పెట్టిన అదే కూలింగ్ సెట్టింగ్‌ను కొనసాగిస్తారు. అయితే బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఫ్రిజ్‌ను మరీ చల్లగా ఉంచాల్సిన అవసరం ఉండదు. ఫ్రిజ్ భాగాన్ని 3°C నుంచి 5°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద ఉంచడం ఉత్తమం. సరైన టెంపరేచర్ వల్ల లోపల అధిక తేమ పేరుకుపోవడం తగ్గుతుంది.
ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్రిజ్‌లలో Humidity Control, Moisture Control లేదా Season Mode వంటి ఫీచర్లు ఉంటాయి. వర్షాకాలంలో వీటిని సరైన మోడ్‌లో ఉంచితే లోపల తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ ఫ్రిజ్ మాన్యువల్‌లో ఈ సెట్టింగ్ ఎలా ఉపయోగించాలో ఒకసారి చూడండి.
ప్రతిసారి ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడు బయట ఉన్న తేమతో కూడిన గాలి లోపలికి చేరుతుంది. తర్వాత అది చల్లని ఉపరితలాలపై నీటి బిందువులుగా మారుతుంది. అవసరం ఉన్నప్పుడే తలుపు తెరవడం, వెంటనే మూసేయడం మంచిది.
ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బర్ సీల్ (గ్యాస్కెట్) దెబ్బతింటే బయట గాలి నిరంతరం లోపలికి వస్తుంది. దీంతో తేమ పెరిగి నీరు చేరుతుంది. రబ్బర్ సరిగా ఉందో లేదో చూసి, దెబ్బతిన్నట్లయితే మార్చించండి.
వేడి అన్నం, కూరలు లేదా ఇతర ఆహారాలను వెంటనే ఫ్రిజ్‌లో పెడితే ఆవిరి ఏర్పడి లోపల నీటి బిందువులు ఎక్కువగా ఏర్పడతాయి. ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే డ్రెయిన్ హోల్ మూసుకుపోతే కరిగిన నీరు బయటకు వెళ్లకుండా లోపలే నిల్వ అవుతుంది. దీనివల్ల కూరగాయల ట్రే కింద నీరు చేరుతుంది. అవసరమైతే డ్రెయిన్ హోల్‌ను శుభ్రం చేయండి లేదా సర్వీస్ సెంటర్ సహాయం తీసుకోండి.
ఫ్రిజ్‌లో వస్తువులను ఎక్కువ పెడితే చల్లని గాలి సరిగా ప్రసరించదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువై నీరు చేరే అవకాశం ఉంటుంది. గాలి సులభంగా తిరిగేలా కొంత ఖాళీ ఉండేలా అమర్చండి.