Credit Card : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే.. లేకుంటే నష్టమే
డబ్బులు లేనప్పుడు అప్పు కావాలంటే ఒకప్పుడు వేరే వ్యక్తి నుంచి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డబ్బులు లేకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ చాలామంది దగ్గర ఉంటాయి. షాపింగ్ చేసేందుకు, అవసరమైనప్పుడు డబ్బులు తీసుకునేందుకు దీనిని వినియోగిస్తారు.
అయితే క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు డ్రా చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. లేకపోతే విత్‌డ్రా సమయంలో మీకు చాలా నష్టం జరుగుతుంది. అయితే ఇలా డబ్బులు తీసుకోవాలనుకున్నప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే.. దానిపై వడ్డీ ప్రారంభమవుతుంది. ఇది సంవత్సరానికి 36 నుండి 48% వరకు ఉండవచ్చు.
ఇది కాకుండా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి నగదు ఉపసంహరణపై నగదు అడ్వాన్స్ రుసుము కూడా చెల్లించాలి. ఇది 2.5% నుంచి 3.5% వరకు ఉండవచ్చు. అంటే మీరు 10,000 తీసుకోవాలనుకుంటే.. దానిపై మీరు 250-350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ ఉపయోగించి లావాదేవీలు చేస్తే మీకు 45 నుంచి 50 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. కానీ మీరు డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు ఆ సదుపాయం ఉండదు. నగదు తీసిన రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. క్రెడిట్ కార్డ్ నుంచి ఎక్కువ డబ్బులు తీస్తే అది సిబిల్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్‌తో డబ్బులు విత్ డ్రా చేసేముందు జాగ్రత్త.