Single Sleep vs Biphasic Sleep : ఒకేసారి నిద్ర మంచిదా? రెండు భాగాలుగా నిద్ర మంచిదా? నిపుణుల అభిప్రాయం ఇదే
కొంతమంది నిపుణులు 7 నుంచి 8 గంటల నిద్ర అత్యంత సహజమైనదని.. శరీరాన్ని రీసెట్ అవుతుందని చెప్తారు. ఎందుకంటే శరీరం గాఢ నిద్ర, రెమ్ వంటి అన్ని నిద్ర స్థాయిల ద్వారా ప్రశాంతంగా వెళుతుంది. ఇది జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, శక్తిని మెరుగుపరుస్తుంది.
అదే సమయంలో కొంతమంది సహజంగా బైఫేసిక్ నమూనాను అనుసరిస్తారు. అంటే రాత్రి సమయంలో 6 నుంచి 7 గంటలు.. పగటిపూట 20 నుంచి 30 నిమిషాలు నిద్రపోతారు. చాలా సంస్కృతులలో మొదటి నిద్ర, రెండవ నిద్ర నమూనా కూడా కనిపిస్తుంది.
దీని గురించి నిపుణులు ఈ రోజుల్లోని జీవనశైలి, దినచర్య ప్రకారం.. ఒకేసారి ఎక్కువ నిద్రపోవడం మంచిదని చెబుతున్నారు. రెండు భాగాలుగా నిద్రపోవడం అప్పుడప్పుడు మాత్రమే మంచిదని.. రెండు భాగాలు ఎక్కువసేపు ఉండి నిద్ర చక్రం పూర్తి చేయడం చాలా మందికి కష్టం అవుతుందని చెప్తున్నారు.
అదేవిధంగా నిపుణులు రెండు భాగాలుగా విభజించి.. స్లీప్ షెడ్యూల్ సెట్ చేసుకోగలిగితే.. ఈ నిద్ర కూడా బాగానే ఉంటుందని చెబుతున్నారు. నిపుణులు నిద్ర గురించి మాట్లాడుతూ నిద్రకు క్రమబద్ధత చాలా ముఖ్యమంటున్నారు.
కొంతమంది నిపుణులు షిఫ్ట్ వర్కర్లు, కొత్త తల్లిదండ్రులు, సంరక్షకులు, క్రమరహిత షెడ్యూల్ ఉన్న వ్యక్తులు తరచుగా రెండు భాగాలుగా నిద్రపోతారని చెబుతున్నారు. వారికి ఈ విధానం పరిస్థితులకు అనుగుణంగా ఉండవచ్చు.. కాని ఇది సాధారణ ప్రజలకు మంచిది కాదంటున్నారు.
నిజానికి ఫ్రాగ్మెంటెడ్ నిద్ర నెమ్మదిగా నిద్రను తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, భావోద్వేగ సమతుల్యత, రోగనిరోధక శక్తితో ముడిపడి ఉంటుంది. ఇది రోజంతా అలసట, నెమ్మదిగా స్పందించడం, కెఫిన్ పై ఆధారపడటం వంటి వాటిని పెంచుతుంది. దీర్ఘకాలంలో ఇది నిద్ర సంబంధిత సమస్యలను కూడా పెంచుతుంది.
అంతేకాకుండా చాలా మంది రాత్రి సమయంలో రెండు నుంచి నాలుగు సార్లు మేల్కొంటారు. అయితే మేల్కొనే సమయం చాలా పెరిగినప్పుడు, మొత్తం నిద్రకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ అలవాటు సమస్యగా మారుతుంది. ఎక్కువ కాలం మేల్కోవడం ఒత్తిడి, చెడు అలవాట్లు లేదా స్లీప్ అప్నియా వంటి సమస్యలకు సంకేతం కావచ్చు.
అలాంటప్పుడు నిపుణులు ఒకేసారి నిద్రపోవడం చాలా మందికి మంచిదని చెబుతున్నారు. క్రమం తప్పకుండా నిద్ర లేవడం నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ప్రశాంతమైన చల్లని గది దీనిని సులభతరం చేస్తుంది.
సమయాన్ని పాటించని నిద్ర, మధ్య మధ్యలో మేల్కొనడం లేదా పగటిపూట ఎక్కువ నిద్రపోవడం శరీర గడియారాన్ని దెబ్బతీస్తుంది. నిపుణులు నిద్రకు సంబంధించి రోజంతా శక్తి, ఏకాగ్రత, మానసిక ఉల్లాసం ఉండేలా ఒక నమూనాను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.