Putin's No Smartphone Rule : రష్యా అధ్యక్షుడు పుతిన్ స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడరో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలివే
నాలుగేళ్ల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలతో సంభాషించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటుందని ఎవరో చెప్పగా.. పుతిన్ వెంటనే తన దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదని తెలిపారు. అలాగే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చర్చించారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే.. వ్యక్తిగత గోప్యత, భద్రత రెండింటికీ ప్రమాదం అని అన్నారు.
పుతిన్ చాలాసార్లు బహిరంగంగా మాట్లాడుతూ.. తాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేని వ్యక్తి అని చెప్పారు. క్రెమ్లిన్ కాంప్లెక్స్‌లో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించామని.. రష్యన్ ఏజెన్సీకి కూడా చెప్పారు. ఎవరినైనా సంప్రదించాల్సిన అవసరం వచ్చినప్పుడు.. ప్రభుత్వ లైన్ మాత్రమే ఉపయోగిస్తారట. ఇంటర్నెట్ను కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తానని.. ఎందుకంటే అది పూర్తిగా సురక్షితం కాదని ఆయన భావిస్తారు.
ఒక కార్యక్రమంలో పిల్లలతో మాట్లాడేటప్పుడు.. ఆయన ఇంటర్నెట్ను CIA ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. సగం సమాచారం తప్పు లేదా అనారోగ్యకరమైనది ఉంటుందని అన్నారు. అందుకే ఆయన మొబైల్, ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాలకు దూరంగా ఉంటారు. ఆయన చుట్టూ కూడా అలాంటి పరికరాలను ఉంచడానికి అనుమతించరట.
ఫోన్ లేకపోతే ప్రపంచ వార్తలను ఎలా తెలుసుకుంటారనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే వాస్తవానికి పుతిన్ ప్రతి అవసరమైన సమాచారం కోసం.. టీవీ ఛానెళ్లు చూస్తారట. నిఘా సంస్థల నివేదికలు, అధికారిక పత్రాలు, టీవీ సమావేశాలు, సాధారణ భద్రతా నవీకరణలు ఆయనకు అందుబాటులో ఉంటాయి.
అయితే స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉండటం వలన పరిమిత సమాచారాన్ని మాత్రమే పొందగలుగుతున్నారని విమర్శకులు అంటున్నారు. ప్రపంచంలోని అనేక పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఆయనకు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.