Parenting Tips : పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయకూడని తప్పులు ఇవే.. లేదంటే వారిపై చెడు ప్రభావం పడుతుంది
పిల్లల ముందు తల్లిదండ్రులు పొరపాటున కూడా వారి మనస్సుపై చెడు ప్రభావం చూపే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే పిల్లలు విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అది వారికి చెడు అనుభవం ఇస్తే.. మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని విషయాల గురించి చర్చించకూడదు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
పిల్లలను ఎప్పుడూ ఇతర పిల్లలతో లేదా వారి అన్నదమ్ములతో పోల్చకూడదు. అలా చేయడం వల్ల వారిలో తమపట్ల హీనభావం కావచ్చు. లేదా అవతలి పిల్లవాడిపై కోపం రావొచ్చు. దీనివల్ల ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇతరులకు హాని కలిగించే అవకాశం ఉంది.
పిల్లలను రోజంతా అనవసరంగా తిట్టకూడదు. అతిగా కంట్రోల్ చేయకూడదు. అలా చేయడం వల్ల వారు స్వేచ్ఛగా వారి బాల్యాన్ని ఆస్వాదించలేరు. వారిలో కోపం, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది.
కొందరు తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం.. వారి పిల్లలు నెమ్మదిగా పని చేస్తారట. అందుకే వారిని తిట్టడం లేదా కొట్టడం చేస్తారట. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. మీరు కొట్టడం లేదా తిట్టడం వల్ల పిల్లలు త్వరగా పని చేస్తారా? పిల్లలతో కూర్చుని ప్రేమగా వారికి వివరిస్తూ ఉంటే తేడాలు మీరు గమనించవచ్చు.
పిల్లలను చదివిస్తున్నప్పుడు వారికి ప్రేమగా అర్థమయ్యేలా వారు చేసే తప్పులను చెప్పాలి. అంతేకానీ పిల్లలపై అరవడం, కొట్టడం చేయకూడదు. పదే పదే మీరు వారిని కొట్టడం వల్ల వారు మిమ్మల్ని చూసి భయపడతారు. దగ్గరకు రావడానికి కూడా ఆలోచిస్తారు.
పిల్లలతో ఎప్పుడూ కూడా నేను నిన్ను కనకుండా ఉంటే బాగుండేదనే డైలాగ్ చెప్పకూడదు. ఇలాంటి మాటలు పిల్లల మనస్సుపై తీవ్ర ప్రభావాని చూపిస్తాయి.