Kopi Luwak : జంతువుల మలం(Shit)తో లగ్జరీ కాఫీ తయారీ.. ధర తెలిస్తే షాక్ అవుతారు
కాఫీ లువాక్ ఆసియాన్ పామ్ సివెట్ జీర్ణవ్యవస్థ ద్వారా వెళ్లే కాఫీ గింజలను ఉపయోగించి తయారు చేస్తారట. ఇది ఇండోనేషియా, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలలో కనిపించే ఒక చిన్న, పిల్లి లాంటి క్షీరదం. స్థానికంగా దీనిని లువాక్ అని పిలుస్తారు. ఇది తినడానికి బాగా పండిన, అత్యుత్తమ నాణ్యత గల కాఫీ చెర్రీలను మాత్రమే ఎంచుకుంటుందట.
ఈ కాఫీని ప్రత్యేకంగా మార్చేది ఏమిటంటే సివెట్ సహజమైన క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇది తన అలవాటు ప్రకారం ముడి లేదా తక్కువ నాణ్యత గల చెర్రీలను వదిలివేస్తుందట. ఉత్తమమైన వాటిని మాత్రమే తింటుంది. దీనివల్ల ప్రీమియం బీన్స్ మాత్రమే లోపలికి వెళ్తాయి.
సివెట్ కాఫీ చెర్రీలను తిన్నప్పుడు పండు గుజ్జు జీర్ణమవుతుంది. కాని గింజలు అలాగే ఉంటాయి. జంతువు కడుపు లోపల సహజ ఎంజైమ్లు పులియబెట్టే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇది గింజలలోని కొన్ని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల చేదు తగ్గుతుంది. మృదువైన, మరింత గొప్ప రుచి ఏర్పడుతుంది.
ఈ ప్రాసెస్ తర్వాత బీన్స్ మలంతో పాటు బయటకు వస్తాయి. వీటిని సేకరించి.. బాగా కడిగి, ఎండలో ఎండబెట్టి, తరువాత వేయిస్తారు. తుది ఉత్పత్తి చాలా పరిశుభ్రంగా ఉంటుంది. తాగడానికి సురక్షితంగా మారుస్తారు.
ఇవి తక్కువగా ఉండడం వల్ల ఖరీదు ఎక్కువగా ఉంటుందట. సివెట్ చాలా తక్కువ మొత్తంలో బీన్స్ ఉత్పత్తి చేస్తుంది. వాటిని సేకరించే ప్రక్రియ కూడా చాలా నెమ్మదిగా, శ్రమతో కూడుకున్నది. ఉత్పత్తిని పెంచలేనందున.. సరఫరా చాలా పరిమితం. అందుకే ఇది లగ్జరీ కేటగిరీలోకి వస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ కాఫీ ధర కిలో 60,000 నుంచి 70000 రూపాయలు. విదేశాలలో లగ్జరీ కేఫ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒక కప్పు ధర 3000 నుండి 5000 రూపాయల వరకు ఉండవచ్చు.