Hidden Cameras : హోటల్, డ్రెస్సింగ్ రూమ్‌లలో కెమెరా ఉందా? లేదా? అమ్మాయిలు ఇలా చెక్ చేసుకోండి
నేటి కాలంలో ప్రతిదీ డిజిటల్ కెమెరాలలో బంధీ అవుతున్నాయి. ఎవరైనా రోడ్డు మీద ఉన్నా, భవనంలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా.. ప్రతిచోటా వీధుల్లో సీసీ కెమెరాల్లో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇవి ప్రజల సేఫ్టీ కోసం ఉపయోగించేవి.
కానీ కొందరు హోటల్ గదుల్లో, డ్రెస్ చేంజింగ్ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఉంచి.. వారి పర్సనల్ స్పేస్‌ని బహిర్గతం చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు దుస్తులు మార్చుకునేప్పుడు లేదా వాష్ రూమ్‌కి వెళ్లేప్పుడు హిడెన్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి.. క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు.
ఇలా చేయడం ఇబ్బంది పెట్టే విషయం మాత్రమే కాదు.. చట్టపరంగా కూడా నేరం. ఇలా వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం లేక.. శారీరకంగా ఫేవర్స్ అడగడం చేస్తారు. అందుకే మీరు హోటల్‌కి వెళ్లినా లేదా డ్రెస్ చేంజింగ్ రూమ్‌లోకి వెళ్ళినా అక్కడ హిడెన్ కెమెరా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
హోటల్ గదిలోకి వెళ్లినప్పుడల్లా మొదట గదిని బాగా పరిశీలించాలి. కెమెరాలను సాధారణంగా మీ దృష్టికి రాని ప్రదేశాలలో ఉంచుతారు. గోడలలోని చిన్న రంధ్రాలు, టీవీ వెనుక, గడియారం, స్పీకర్ లేదా ఇతర పరికరాలలో దాచిపెడతారు.
కాబట్టి కెమెరాను కనుగొనడానికి ఒక సాధారణ ట్రిక్ ఏమిటంటే.. గదిలోని అన్ని లైట్లను ఆపేసి మీ ఫోన్ ఫ్లాష్ లైట్‌ను ఆన్ చేయండి. తరువాత గోడలు, పైకప్పులు, ఫ్యాన్లు, అలారం గడియారం వంటి ప్రదేశాలలో కాంతిని ప్రసరించండి. ఏదైనా ప్రదేశం నుంచి కొద్దిగా మెరుపు కనిపిస్తే అక్కడ కెమెరా దాగి ఉండవచ్చు. కెమెరా లెన్స్ ఫ్లాష్ లైట్ వెలుగులో ప్రతిబింబిస్తుంది. మీరు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా లైట్లు ఆపి ఫ్లాష్ లైట్‌తో తనిఖీ చేయవచ్చు.
మీరు వైఫైకి కనెక్ట్ చేసి ఉన్న అన్ని పరికరాలను స్కాన్ చేసే కొన్ని మొబైల్ యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు గదిలో ఏయే పరికరాలు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. మీకు ఏదైనా పరికరం లేదా మూలలో అనుమానం వస్తే.. దాన్ని అస్సలు విస్మరించవద్దు. నేరుగా హోటల్ సిబ్బందితో మాట్లాడండి. అవసరమైతే గదిని మార్చుకోండి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.