Egg Palak Curry Recipe : ధాబా స్టైల్ ఎగ్ పాలక్ కర్రీ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండిలా
ముందు పాలకూరను బాగా కడిగి.. కొద్దిగా ఉడికించాలి. రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడికించడం వల్ల పాలకూర రంగు, రుచి రెండూ తగ్గుతాయి. కాబట్టి కాస్త ఉడికించి వెంటనే చల్లటి నీటిలో వేయండి. తద్వారా దాని ఆకుపచ్చ రంగు హోటల్ లాగా మెరుస్తూ ఉంటుంది.
ఇప్పుడు 2 నుంచి 3 ఉడికించిన గుడ్లు తీసుకుని దానికి చిన్న కోతలు పెట్టండి. స్టౌవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనె వేడి చేసి.. గుడ్లను బంగారు రంగులోకి వచ్చే వరకు కొద్దిగా వేయించుకోండి. ఇదే వేయించిన గుడ్డు ధాబా-స్టైల్ కర్రీకి అసలైన రుచిని ఇస్తుంది. పైన కొద్దిగా ఉప్పు, కారం చల్లితే రుచి మరింత పెరుగుతుంది.
ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేయండి. జీలకర్ర చిటపటలాడిన వెంటనే ఉల్లిపాయలు వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇదే కర్రీకి బేస్‌గా చెప్తారు. ఇది ధాబా స్టైల్ రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది.
ఇప్పుడు పసుపు, ధనియాలు, ఎర్ర మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా నూనెను విడుదల చేసే వరకు ఉడికించడం అవసరం. తరువాత టొమాటో ప్యూరీని వేసి, గ్రేవీ ముదురు రంగులోకి మారి సువాసన వచ్చే వరకు ఉడికించాలి. టొమాటోలు, మసాలా దినుసులు బాగా కలిసి అద్భుతమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి.
ఉడికించిన పాలకూరను మిక్సర్లో కచ్చితంగా గ్రైండ్ చేయండి. దీనిని చాలా మెత్తగా పేస్ట్ చేయవద్దు. ఎందుకంటే ధాబా స్టైల్లో కొద్దిగా పలుకుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరను మసాలా గ్రేవీలో కలపండి. కొద్దిగా నీరు పోసి చిక్కగా ఉడకనివ్వండి.
గ్రేవీ ఉడికేప్పుడు వేయించిన గుడ్లను వేయండి. మంటను తగ్గించి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తద్వారా గుడ్లలో పాలకూర మసాలా మొత్తం రుచి వస్తుంది. కొద్దిగా కసూరి మేకి, ఒక స్పూన్ మలై వేయండి. ఇది ధాబా స్టైల్ ఫ్లైవర్ ఇస్తుంది.
ఈ వేడి వేడి ఎగ్ పాలక్ కర్రీని రోటీ, నాన్ లేదా జీలకర్ర అన్నంతో తినండి. అంతే టేస్టీ, హెల్తీ రెసిపీని మీరు కూడా ఆస్వాదించవచ్చు.