Constipation : మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నారా? పాలల్లో ఆ రెండూ కలిపి తాగేయండి
మలబద్ధకం ఉంటే మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలుగుతుంది. లేదా మలం గట్టిగా, పొడిగా మారి ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో పేగులలో మలం పేరుకుపోయి తీవ్రమైన ఇబ్బందలను కలిగిస్తుంది. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, నీరు తాగకపోవడం, ఫైబర్ లోపం, ఒత్తిడి, జీవనశైలి మార్పులు దీనికి కారణమవుతాయి. ఇవి ఎక్కువకాలం కొనసాగితే పైల్స్, పాయువు పగుళ్లు (ఫిషర్), పేగు వాపు వంటి సమస్యలు వస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఏదో ఒక రూపంలో మలబద్ధకంతో బాధపడుతున్నారట. భారతదేశంలో ఈ సమస్య మరింత సాధారణమని.. ఎందుకంటే మన ఆహారంలో తరచుగా ఫైబర్ లోపం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయుర్వేద విభాగం హెడ్ డాక్టర్ ప్రతాప్ చౌహాన్ ప్రకారం.. ''పేగుల ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ఆధారం. పేగులు శుభ్రంగా, ఆరోగ్యంగా లేకపోతే.. పోషకాల శోషణ ప్రభావితమవుతుంది. దీనివల్ల అలసట, బలహీనత, ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి వేడి పాలలో నెయ్యి, త్రిఫల చూర్ణం కలిపి తాగితే మంచిది. ఇది మలబద్ధకాన్ని మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది.''
ఆయుర్వేదంలో పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇది కాల్షియం, ప్రోటీన్, విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది. దీనికి నెయ్యి, త్రిఫల చూర్ణం కలిపినప్పుడు దాని పోషక విలువ, ఔషధ గుణాలు అనేక రెట్లు పెరుగుతాయి.
అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. త్రిఫల చూర్ణంలో ఉన్న పీచు, యాంటీఆక్సిడెంట్ గుణాలు పేగుల కదలికను పెంచుతాయి. మలవిసర్జనను క్రమబద్ధీకరిస్తాయి. అదేవిధంగా జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన మరో అధ్యయనంలో నెయ్యిలో ఉన్న బ్యూటిరిక్ ఆమ్లం ప్రేగుల మైక్రోబయోమ్ ను మెరుగుపరుస్తుందని తెలిపారు. కాబట్టి ఈ మూడు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.