Breast Cancer Prevention : మహిళలు తమ లైఫ్స్టైల్లో ఈ 5 మార్పులు చేస్తే రొమ్ము క్యాన్సర్ దూరం చేసుకోవచ్చు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించడానికి ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, ఉదయం సూర్యరశ్మి తీసుకోవడం అవసరమని చెప్తున్నారు. నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా ఏదైనా కార్యాచరణ శరీరాన్ని బలంగా చేస్తుంది. విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి మాత్రమే కాకుండా.. శరీర కణజాలాలను మరమ్మత్తు చేయడానికి, యాంటీబాడీలను తయారు చేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థకు బ్యాక్టీరియా, క్యాన్సర్ కణాలతో పోరాడటానికి ప్రోటీన్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్కు స్వీట్సే ఆహారం అని చెప్తున్నారు నిపుణులు. అందువల్ల, జంక్ ఫుడ్, మిఠాయిలు, చాక్లెట్లు, ఐస్ క్రీం, కోల్డ్ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు తక్కువ మోతాదులో తీసుకోచ్చు.. రోజువారీ జీవనశైలిలో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్తున్నారు.
అలాగే ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించడానికి శరీరానికి తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం.
అంతేకాకుండా ప్రతి మహిళా నెలకు ఒకసారి తన రొమ్ములను పరీక్షించుకోవాలని.. సంవత్సరానికి ఒకసారి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్ గుర్తించి.. చికిత్స చేయించుకోవచ్చని చెప్తున్నారు.