BP Difference in Two Hands : రెండు చేతుల్లో బీపీ వేర్వేరుగా వస్తుందా? ఎంత తేడా ఉంటే ప్రమాదమో తెలుసా?
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో కూడా రెండు చేతుల BPలో కొంచెం తేడా ఉండటం సహజం. సాధారణంగా 10 mmHg (మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ) వరకు వ్యత్యాసం ఉంటుందట. అంటే ఒక చేతిలో 122/78 ఉంటే.. మరొక చేతిలో 128/80 ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రెండు చేతుల రక్తపోటులో 10–15 mmHg కంటే ఎక్కువ వ్యత్యాసం మళ్లీ మళ్లీ వస్తే.. సిస్టోలిక్ మార్పులు ఉంటే.. దానిని తేలికగా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. అలా జరిగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎక్కువ వ్యత్యాసం రక్త నాళాలకు సంబంధించిన వ్యాధుల సంకేతం కావచ్చు.
ఇలా రావడానికి Peripheral Artery Disease ఓ కారణం కావచ్చు. అంటే ఒక చేతి ధమనిలో బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనివల్ల రక్త ప్రవాహం, BP రీడింగ్ ప్రభావితమవుతాయి. రెండోది చాలా అరుదైన కారణం. కానీ అది తీవ్రమైన Aortic Dissection కావచ్చు. అంటే గుండె నుంచి బయలుదేరే పెద్ద ధమనిలో అకస్మాత్తుగా చీలిక ఏర్పడటం. ఇది అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. దీనితో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఒక వీడియోలో మాట్లాడుతూ.. సిస్టోలిక్ BPలో 10 mmHg, డయాస్టోలిక్ BPలో 5 mmHg వరకు తేడా ఉంటే అది సాధారణమని తెలిపారు. 15 mmHg కంటే ఎక్కువ తేడా ఉంటే అది వాస్కులర్ డిసీజ్ సంకేతం కావచ్చని.. వైద్యుడి దగ్గరికి వెంటనే వెళ్లాలని తెలిపారు.
వైద్య మార్గదర్శకాల ప్రకారం.. కొత్త రోగులు లేదా అధిక గుండె ప్రమాదం ఉన్న వ్యక్తుల BPని రెండు చేతుల్లోనూ కొలుస్తారు. ఒక చేతిలో BP ఎక్కువగా వస్తే, ఫలితాలు ఒకేలా ఉండేలా.. ఇకపై అదే చేతి రీడింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.
మీ దగ్గర BP యంత్రం ఉంటే.. మీరు ఇంట్లో కూడా రెండు చేతుల్లోనూ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మొదట ఒక చేతిలో BP తీసుకోండి. అనంతరం ఒక నిమిషం ఆగి.. రెండవ చేతితో బీపీ చెక్ చేసుకోండి. మీ రీడింగ్‌లను గమనించండి. వ్యత్యాసం పదేపదే 10–15 mmHg కంటే ఎక్కువగా వస్తే డాక్టర్‌ను సంప్రదించండి.