Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
సరైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల స్థిరమైన ఆదాయం, మంచి రాబడి రెండూ లభిస్తాయి. దీని కోసం మీరు ట్రెజరీ బిల్లులలో పెట్టుబడి పెట్టవచ్చు. ట్రెజరీ బిల్లులు తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి మంచివి. ఇవి 91, 182, 364 రోజులకు వస్తాయి. వీటిలో వడ్డీ విడిగా లభించదు. కానీ తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మెచ్యూరిటీపై పూర్తి మొత్తం లభిస్తుంది.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడికి బలమైన ఎంపిక. వీటి కాల వ్యవధి 7 సంవత్సరాలు. వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకు అప్డేట్ అవుతుంది. ప్రస్తుతం వీటిపై మంచి రాబడి లభిస్తోంది. వడ్డీ పెరిగితే.. ప్రయోజనం కూడా పెరుగుతుంది. ఇది పెట్టుబడిని సురక్షితంగా, లాభదాయకంగా మారుస్తుంది.
కార్పొరేట్ బాండ్లు ఎఫ్డీల కంటే ఎక్కువ రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు నచ్చుతాయి. వీటిలో 9 నుంచి 11 శాతం వరకు వడ్డీ లభించవచ్చు. అయితే ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ క్రెడిట్ రేటింగ్ను తప్పనిసరిగా చూడాలి. బలమైన రేటింగ్ ఉన్న కంపెనీలు ఎక్కువ నమ్మదగినవిగా చెప్తారు.
కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో కంపెనీలకు కొంత కాలానికి డబ్బులు ఇస్తారు. దీనికి బదులుగా, బ్యాంక్ ఎఫ్డిల కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. చాలా ఎన్బిఎఫ్సిలు 8.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ బీమా ఉండదు. కాబట్టి నమ్మదగిన, బలమైన కంపెనీలను ఎంచుకోవడం ముఖ్యం.
ప్రభుత్వ బాండ్లు అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుంది. వీటిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. రాబడి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా వీటిపై దాదాపు 7 శాతం వడ్డీ లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది నమ్మదగిన ఎంపిక అవుతుంది.
ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా ఉండాలని కోరుకుంటే.. కేవలం FD లపై ఆధారపడకండి. సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి రాబడి పొందుతారు. అలాగే భద్రతతో కూడిన స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. మీ లక్ష్యాలు, సమయానికి అనుగుణంగా సరైన పథకాన్ని ఎంచుకుని ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఒక్కటే అవసరం.