Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్టులో కూడా బీరు తయారు చేసి తాగేవారు. మొదట్లో మట్టి పాత్రల్లో తరువాత స్పష్టమైన గాజు సీసాలలో నిల్వ చేసేవారు. కానీ బీరు వ్యాపారం పెరిగేకొద్దీ.. దానిని దూర ప్రాంతాలకు పంపడం ప్రారంభించారు.
అప్పుడే ఒక పెద్ద సమస్య వచ్చింది. బీరు రుచి త్వరగా చెడిపోతుందని గుర్తించారు. బీరులో హాప్స్ అనే ఒక ప్రత్యేకమైన మూలకం ఉంటుంది. ఇది దాని రుచి, వాసన కోసం చాలా అవసరం. బీరుపై సూర్యుని అతినీలలోహిత కిరణాలు అంటే UV కిరణాలు పడినప్పుడు.. ఈ కిరణాలు హాప్స్తో కెమికల్ రియాక్షన్ జరుపుతాయి.
ఇది బీరులో వింత వాసనను ఇస్తుంది. అందుకే ఎండలో ఉంచిన బీరు తరచుగా చెడిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటూ.. బీరు తయారీదారులు గోధుమ రంగు గాజు సీసాలు UV కిరణాలను ఎక్కువగా నిరోధిస్తాయని కనుగొన్నారు.
గోధుమ రంగు సీసా సూర్యుని హానికరమైన కిరణాలను చాలా వరకు నిరోధిస్తుంది. దీనివల్ల బీరు రుచి, వాసన చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటాయి. అందుకే చాలా కాలం పాటు గోధుమ రంగు సీసాలు బీరు పరిశ్రమకు ప్రమాణంగా మారాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాలలో గాజు కొరత ఏర్పడింది. ముఖ్యంగా గోధుమ రంగు గాజు కొరత ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో బీరు కంపెనీలు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు సీసాలను ఉపయోగించవలసి వచ్చింది. ఆకుపచ్చ సీసాలు UV కిరణాల నుంచి కొంతవరకు రక్షణను అందిస్తాయి. అయితే గోధుమ రంగు సీసాలంత కాదు. నెమ్మదిగా ప్రజలు ఆకుపచ్చ సీసాలను ఇష్టపడటం ప్రారంభించారు. చాలా బ్రాండ్లు దీనిని తమ గుర్తింపుగా మార్చుకున్నాయి.
ట్రాన్సపరెంట్ లేదా తెల్లటి గాజు సీసాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు. కానీ ఇవి UV కిరణాలను అస్సలు నిరోధించలేవు. అలాంటి సీసాలలో ఉంచిన బీరు త్వరగా పాడైపోవచ్చు. అందుకే పారదర్శక సీసాలను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఒకవేళ ఉపయోగిస్తే ప్రత్యేకమైన ప్యాకింగ్ చేస్తారు.
నేడు బీరు క్యాన్, కేగ్, ఆధునిక ప్యాకేజింగ్‌లో లభిస్తున్నప్పటికీ.. ఆకుపచ్చ, గోధుమ రంగు సీసాలు ఇప్పటికీ నమ్మదగినవిగా పరిగణిస్తారు. ఇవి బీరు నాణ్యతను కాపాడడమే కాకుండా.. వినియోగదారుల మనస్సులలో క్లాసిక్, ప్రీమియం ఇమేజ్‌ను ఇస్తాయి. అందుకే సీసా రంగు బీరు రుచికి సైలెంట్ ప్రొటెక్టర్ అంటారు.