Aadhaar Photo Update : ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటోను ఇలా మార్చుకోండి.. ఖర్చు, పూర్తి ప్రక్రియ ఇదే
వయస్సు పెరిగేకొద్దీ ఆధార్‌లోని ఫోటో చాలా భిన్నంగా ఉంటుంది. గుర్తింపుపై ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో ఇతరులకు ఆధార్ చూపించడానికి చాలామంది వెనుకాడతారు. మీరు కూడా ఈ సంకోచాన్ని నివారించాలనుకుంటే.. ఆధార్ కార్డ్‌లో ఫోటో మార్చుకోవడం మంచిది.
ఆధార్‌లో ఫోటో మార్చుకునే సదుపాయం UIDAI అందిస్తుంది. పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ లాగా ఫోటోను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి వీలుండదు. దీని కోసం ఆధార్ నమోదు కేంద్రానికి లేదా సర్వీస్ సెంటర్‌కు వెళ్లడం తప్పనిసరి.
అక్కడ మీ కొత్త ఫోటో తీస్తారు. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తవుతుంది. ఫోటోను అప్డేట్ చేయడానికి.. మొదట UIDAI అధికారిక వెబ్సైట్ uidai.gov.in ని సందర్శించాలి. ఇక్కడ My Aadhaar విభాగంలోకి వెళ్లి.. Enrollment and Update Forms ఎంపిక చేసుకోవాలి.
ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. అందులో మీ అవసరమైన సమాచారాన్ని నింపాలి. నింపిన ఫారమ్‌ను తీసుకుని సమీపంలోని ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ మీ ఫారమ్‌ను పరిశీలిస్తారు. తరువాత మీ కొత్త ఫోటో తీస్తారు. ఐరిస్ స్కానింగ్ చేస్తారు.
ఈ ప్రక్రియ UIDAI నిబంధనల ప్రకారం జరుగుతుంది. తద్వారా ఎటువంటి తప్పులు జరగకుండా చూస్తారు. ఫోటో అప్డేట్ చేయడానికి ఒక నిర్దిష్ట రుసుము చెల్లించాలి. దీని కోసం 100 రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో GST కూడా ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఒక URN నంబర్ ఇస్తారు.
ఆధార్ అప్డేట్ స్థితిని మీరు ఈ నంబర్ సహాయంతో తనిఖీ చేయవచ్చు. ఆధార్‌లో ఫోటో అప్‌డేట్ కావడానికి సాధారణంగా 30 నుంచి 90 రోజులు పట్టవచ్చు. ఈ సమయంలో మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించి URN నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ట్రాక్ చేయవచ్చు.