Stubborn Stains on Clothes : బట్టలపై మొండి మరకలు వదలట్లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో 2 నిమిషాల్లో పోతాయి
టీ, తుప్పు, గ్రీజు, నూనె లేదా చెమట మరకలు త్వరగా పోవు. సరైన పద్ధతిని ఉపయోగిస్తే ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతో కూడా ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు. కాబట్టి బట్టలపై మొండి మరకలు ఏర్పడితే వాటిని 2 నిమిషాల్లో ఎలా తొలగించవచ్చో చూసేద్దాం.
బట్టలపై నూనె లేదా గ్రీజు మరకలు పడితే.. టాల్కం పౌడర్ చాలా సహాయపడుతుంది. దీని కోసం మరక ఉన్న ప్రదేశంలో టాల్కం పౌడర్ చల్లుకోండి. టాల్కం పౌడర్ లేకపోతే చాక్ పౌడర్ లేదా కార్న్ స్టార్చ్ కూడా ఉపయోగించవచ్చు. నూనెను పీల్చుకునేలా పౌడర్ను దాదాపు అరగంట పాటు మరక ఉన్న ప్రదేశంలో ఉంచండి. తరువాత, బ్రష్తో పౌడర్ను దులిపి.. డిష్వాష్ లిక్విడ్తో ఆ భాగాన్ని శుభ్రం చేయండి.
పెన్ సిరా బట్టలపై పడితే శానిటైజర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించవచ్చు. కాటన్ బాల్ మీద కొంచెం శానిటైజర్, నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి మరక ఉన్న ప్రదేశంలో మెత్తగా తట్టండి. తరువాత బట్టలను సాధారణంగా ఉతకండి. ఇది సిరా మరకను తేలికగా చేస్తుంది.
దుస్తులపై లిప్ స్టిక్ మరకలు ఏర్పడితే హెయిర్ స్ప్రే లేదా లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో హెయిర్ స్ప్రే చల్లండి. 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచండి. తరువాత తడి గుడ్డతో ఆ భాగాన్ని తేలికగా తుడవండి. ఇది మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.
అలాగే బేకింగ్ సోడా కూడా బట్టలపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో కొంచెం నీరు కలిపి పేస్ట్ తయారు చేసి మరక ఉన్న ప్రదేశంలో రాయండి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తగా రుద్ది బట్టలను ఉతకండి. ఇది త్వరగా మరకలను తగ్గిస్తుంది.
బట్టలపై మొండి మరకలను తొలగించడానికి ఉప్పు, నిమ్మకాయ కూడా హెల్ప్ చేస్తాయి. దీని కోసం మరక ఉన్న ప్రదేశంలో నిమ్మరసం వేసి.. దానిపై కొంచెం ఉప్పు చల్లండి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత బట్టలను నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మరకను తేలిక చేస్తుంది. బట్టల మెరుపును కూడా కాపాడుతుంది.
పాత మరకలను తొలగించడానికి తెల్ల టూత్‌పేస్ట్ కూడా ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో టూత్‌పేస్ట్ వేసి కొంత సమయం పాటు అలాగే ఉంచండి. తరువాత, తేలికపాటి చేతితో రుద్ది బట్టలు ఉతకండి. ఇది మరకలను తగ్గిస్తుంది.